● నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
● జిల్లా వ్యాప్తంగా 9 పరీక్షా కేంద్రాలు
అనంతపురం సెంట్రల్/ అనంతపురం అర్బన్: జిల్లాలో నీట్–2026 పునఃపరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. శనివారం నగరంలోని శ్రీ సాయిబాబా నేషనల్ (ఎస్‌ఎస్‌బీఎన్) డిగ్రీ కళాశాలలోని నీట్ సెంటర్‌లో ఏర్పాట్లను ఎస్పీ జగదీష్, కళాశాల ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ శాంత తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు నీట్ పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు మధ్యాహ్నం 1.30 గంటలలోగా పరీక్షా కేంద్రంలో ఉండాలని, నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులు తప్ప బయటవారిని ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించరాదన్నారు. ప్రతి విద్యార్థికీ తప్పనిసరిగా బయోమెట్రిక్ పరిశీలన చేయాలన్నారు. పరీక్షా కేంద్రం వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సెల్‌ఫోన్లు, నెట్ పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేయాలని, సీసీటీవీలు సజావుగా పనిచే సేలా నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆర్టీసీ బస్సులు సజావుగా నడపాలని నిర్ణయించినట్లు తెలిపారు.
హాజరుకానున్న 3,959 మంది విద్యార్థులు
జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. 3,959 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్ద సెంట్రల్ యూనివర్సిటీ, అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జేఎన్‌టీయూ, పాలిటెక్నిక్ కళాశాల, కేఎస్‌ఎన్ డిగ్రీ కళాశాల, ఎస్కేయూ, ఎస్‌ఎస్‌బీఎన్ డిగ్రీ కళాశాల, గుత్తిలో కేంద్రీయ విద్యాలయం, గుత్తి జెడ్పీ బాలికల హైస్కూల్‌లో నీట్ పరీక్ష జరుగుతుందన్నారు.
● డీఆర్వో మలోల నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారని, కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఈ– అడ్మిట్ కార్డుతో పాటు ఏదేని ప్రభుత్వ గుర్తింపుకార్డుతో పరీక్షకు హాజరుకావాలన్నారు. ఈసారి 15 నిమిషాలు అదనపు సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు. పేపర్ లీక్‌ను అరికట్టేందుకు కేంద్ర బలగాల ఎస్కార్ట్, జిల్లా పోలీసు బందోబస్తు మద్య ప్రశ్నపత్రం, జవాబు పత్రాలు తరలిస్తామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విభాగమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆద్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షను సజావుగా నిర్వహించేలా అన్ని రకాలు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వదంతులు, అసత్య ప్రచారాలు నమ్మరాదన్నారు. దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


