ఉమ్మడి జిల్లాకు వర్షసూచన | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాకు వర్షసూచన

Jun 21 2026 12:25 AM | Updated on Jun 21 2026 12:25 AM

అనంతపురం అగ్రికల్చర్‌: రాగల నాలుగు రోజులూ ఉమ్మడి జిల్లాకు తేలికపాటి వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ విజయశంకరబాబు, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ జి.నారాయణస్వామి తెలిపారు. ఈ మేరకు శనివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 21వ తేదీ 3.2 మి.మీ, 22న 3.8 మి.మీ, 23న 2.2 మి.మీ, 24న 1.7 మి.మీ సగటువర్షపాతం నమోదు కావొచ్చన్నారు. అక్కడక్కడా బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు 7 నుంచి 9 కిలోమీటర్ల వేగంతో నైరుతి దిశగా గాలి వీస్తుందన్నారు. కనీసం 20 మి.మీ వర్షపాతం నమోదైతే పంటలు విత్తుకునేందుకు అనుకూలమని పేర్కొన్నారు.

15 మందికి డీటీలుగా పదోన్నతి

అనంతపురం అర్బన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో 15 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లకు డీటీలుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు కలెక్టర్‌ ఆనంద్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో 14 మందికి రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్లుగా (ఆర్‌ఎస్‌డీటీ), ఒకరికి రెగ్యులర్‌ డిప్యూటీ తహసీల్దారుగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్‌ ఇచ్చారు. ఆర్‌ఎస్‌డీటీలుగా పదోన్నతి పొందిన వారిలో తొమ్మిది మందిని అనంతపురం జిల్లాకు, ఐదుగురిని శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. రెగ్యులర్‌ డీటీగా షేక్షావలికి పదోన్నతి కల్పిస్తూ కలెక్టరేట్‌లో కేఆర్‌ఆర్‌సీ విభాగంలో నియమించారు.

పదోన్నతి పొందినవారు వీరే..

ఆర్‌ఎస్‌డీటీలుగా పదోన్నతి పొందిన వారిలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన హెచ్‌ఎం హేమంత్‌, నరేష్‌కుమార్‌రెడ్డి, బి.షాషావలి, పి.షేక్షావలి, కె.అశోక్‌ ఉన్నారు. అనంతపురం జిల్లాకు చెందిన వారిలో ఒ.భాస్కర్‌రెడ్డి, డి.నాగరాజశేఖర్‌, వి.వరలక్ష్మి, సి.ఎం.చిన్ననారాయణమ్మ, జీవన్‌విజయ్‌కుమార్‌, టి.భారతి, లహరిక, ఎస్‌.సరళ, టి.సంధ్య ఉన్నారు.

రైతు సంక్షేమానికి చర్యలు

బుక్కరాయసముద్రం: రైతు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని కలెక్టర్‌ ఆనంద్‌ పేర్కొన్నారు. శనివారం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్‌ పథకం 2026–27లో భాగంగా మొదటి విడత పెట్టుబడిసాయం మంజూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం, సీఎంల కార్యక్రమాన్ని ప్రొజెక్టర్‌ ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ ఆనంద్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, తహసీల్దార్‌ శ్రీధర్‌మూర్తి, ఎంపీడీఓ సదాశివం, ఆర్టీసీ జోనల్‌ చైర్మన్‌ నాగరాజు, ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఏడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ కేశవరెడ్డి, నాయీబ్రాహ్మణ అభివృద్ధి సంఘం డైరెక్టర్‌ ఆదినారాయణ, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్‌పర్సన్‌ శైలజ, ఎంపీపీ సునీత, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ మల్లేశ్వరి, రేకులకుంట పరిశోధన స్థానం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ నారాయణస్వామి, శాస్త్రవేత్తలు, అధికారులు రైతులు పాల్గొన్నారు.

పీఎం కిసాన్‌–సుఖీభవ సొమ్ము విడుదల

అనంతపురం అగ్రికల్చర్‌: పీఎం కిసాన్‌ కింద 23వ విడతగా... అన్నదాత సుఖీభవ కింద ప్రస్తుత 2026–27కు సంబంధించి మొదటి విడతగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిసాయం కింద శనివారం సొమ్ము విడుదల చేసినట్లు వ్యవసాయశాఖ జేడీ ఎన్‌.సాలురెడ్డి తెలిపారు. పీఎం కిసాన్‌ కింద రూ.2 వేల చొప్పున 2,542,269 మంది రైతులకు రూ.50.85 కోట్లు, అలాగే సుఖీభవ కింద 2,75,642 మంది రైతులకు రూ.5 వేల ప్రకారం 137.82 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.

తప్పుల్లేని ఓటరు జాబితా లక్ష్యం

అనంతపురం అర్బన్‌: తప్పులు లేని ఓటరు జాబితా లక్ష్యంగా జిల్లాలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌–సర్‌) 2026 పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ప్రక్రియ సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ‘సర్‌’పై కలెక్టర్‌ శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో డీఆర్‌ఓ మలోలతో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అర్హుల ఓట్లు తొలగించడం జరగదని స్పష్టం చేశారు. ఓటు నమోదులో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement