● క్షేత్రస్థాయిలో నోచుకోని పరిష్కారం
● ‘పరిష్కార వేదిక’లో వెల్లువలా అర్జీలు
● అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల పాలిట శాపం
అనంతపురం అర్బన్: స్థానికంగా పరిష్కారం కావాల్సిన చిన్న సమస్యలను కూడా అధికారులు అశ్రద్ధ చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు పరిష్కారం కోసం జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీలు వెల్లవలా వస్తున్నాయి. గ్రామ, పట్టణ స్థాయిలో రోడ్లు, కాలువలు, పారిశుధ్యం వంటి చిన్న సమస్యలు కూడా కలెక్టర్ దృష్టికి వస్తుండడమే ఇందుకు నిదర్శనం. ప్రజల సమస్యలపై గ్రామ, మండలస్థాయి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది స్పష్టమవుతోంది. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రెండున్నర నెలలో 15 వేల అర్జీలు అందాయి. ఇందులో రెవెన్యూయేతర సమస్యలకు సంబంధించి దాదాపు 9 వేలు ఉన్నాయి. అందిన అర్జీల్లో చాలా వరకు పరిష్కరించినట్లు అధికారులు చెబుతున్నా... వారి చూపిన పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందడం లేదు. దీంతో అవి రీ–ఓపెన్ అవుతూనే ఉన్నాయి. అలా రీ– ఓపెన్ అయినవే దాదాపు 3 వేల వరకు ఉన్నాయి. కిందిస్థాయి అధికారులు బాధ్యతతో విధులు నిర్వర్తించేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవీ స్థానిక సమస్యలు...
● ‘ఊర్లోని నీరు ఎస్సీ వీధిలో ఇళ్ల మధ్యకు చేరుతోంది. దోమల సమస్య అధికంగా ఉంది. నాలుగు ఏళ్లుగా అర్జీ ఇస్తున్నాము. ఎంపీడీఓకి చెబితే రోడ్డు మధ్య కాలువ తీశారు. అయినా ప్రయోజనం లేకుండాపోయింది. అధికారులు వచ్చి పరిశీలించి సమస్య పరిష్కరించాలని’ కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో కూడేరు మండలం కమ్మూరుకు చెందిన పెద్ద ఓబులేసు విన్నవించాడు.
● ‘మా ఇంటి పక్క వీధిలోని వారు చెత్త, చెదారం, కుళ్లిన వంట పదార్థాలు తీసుకొచ్చి మా కాంపౌండు దగ్గర వేస్తున్నారు. దుర్వాసనతో మా కుటుంబ సభ్యులందరమూ ఇబ్బంది పడుతున్నాం. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి’ అని నార్పల మండలం నడిమిదొడ్డి గ్రామానికి చెందిన షమీమ్ ‘పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేసింది.
● ‘బుక్కరాయసముద్రం చెరువు కట్ట రోడ్డు పాడయ్యింది. ఈ రహదారిలో ప్రయాణం తీవ్ర అసౌకర్యంగా ఉంది. రోడ్డు బాగు చేయాలని రెండేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా అధికారులు ఎండార్స్‌మెంట్ ఇస్తున్నారే తప్ప రోడ్డు మరమ్మతు చేయలేదు. ఇప్పటికై నా సమస్య పరిష్కరించాలని కోరుతున్నాం’ అంటూ అనంతపురం పరిధిలోని నవోదయ కాలనీకి చెందిన జె.కాటమయ్య ‘పరిష్కార వేదిక’లో విన్నవించాడు.
● ‘మా వీధిలో సిమెంట్ రోడ్డు, మురికి కాలువ లేదు. నీటి సమస్య ఉంది. ఐదేళ్లుగా ఈ ప్రాంతంలో నివాసముంటున్నాం. పంచాయతీ అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు’ అని అనంతపురంలోని భైరవనగర్‌కు చెందిన వై.మహేశ్వరరెడ్డి ‘పరిష్కార వేదిక’లో ఫిర్యాదు చేశాడు. ప్రతి వారం ‘పరిష్కార వేదిక’లో కలెక్టర్ దృష్టికి ఇలాంటివి చాలానే వస్తున్నాయి.


