గుంతకల్లు: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దాదాపు 45 రోజులకు గాను రూ.28,13,705 నగదు, 400 గ్రాముల వెండి, అన్నదానం హుండీ ద్వారా రూ.50,453 నగదు సమకూరినట్లు ఆలయ ఈఓ మేడేపల్లి విజయరాజు తెలిపారు. కార్యక్రమంలో గుంతకల్లు సమూహ దేవాలయాల కార్యనిర్వహణ అధికారి మఠం మల్లికార్జున, ఏఈఓ వెంకటేశ్వరుడు, ప్రధాన అర్చకుడు కె.రాఘవాచార్యులు, బ్యాంకు సిబ్బంది, వివిధ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
రాయదుర్గంలో
అర్ధరాత్రి అలజడి
● కూటమి నేతల మధ్య గొడవ
సాక్షి, టాస్క్‌ఫోర్స్: రాయదుర్గంలో బుధవారం అర్ధరాత్రి అలజడి చెలరేగింది. కూటమి నేతల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుకోవడంతో పరస్పరం ఘర్షణ పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల మున్సిపల్ మార్కెట్ యార్డులో పన్ను వసూళ్ల వేలాన్ని టీడీపీ వర్గీయులు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి మార్కెట్ ప్రాంతాన్ని బీజేపీ నాయకుడు కాపు రామచంద్రారెడ్డి సందర్శించారు. టమాట బాక్సుకు రూ.3 పన్ను వసూలు చేయాల్సి ఉండగా రూ.10, ఒక క్యాబేజీ సంచికి రూ.10 కి బదులు రూ.30 అధికంగా వసూలు చేస్తుండడాన్ని గమనించిన ఆయన అక్కడే ఉన్న కాంట్రాక్టర్ సిబ్బందిని నిలదీశారు. దీంతో విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు అక్కడకు చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య కాసేపు మాటల యుద్ధం జరిగింది. పరిస్థితి విషమిస్తుండడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కూటమి నేతల మధ్య విభేదాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చా యి.
లా కళాశాల విద్యార్థుల గొడవ
అనంతపురం సెంట్రల్: నగరంలోని హౌసింగ్‌బోర్డులో ఉన్న విజయనగర లా కళాశాల విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవ పడ్డారు. గురువారం ఉదయం తొలుత ఎస్కేయూనివర్సిటీలో పరస్పరం దాడులతో రెచ్చిపోయారు. అనంతరం సాయంత్రం కళాశాలకు చేరుకున్న తర్వాత కూడా ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వివాదాన్ని సద్దుమణిగించారు. ఘటనపై విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.


