అనంతపురం టౌన్: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలపై అలసత్వం వహించకుండా త్వరతగతిన పరిష్కరించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వివిధ సమస్యలపై 494 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్‌లో వస్తున్న అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కారం అయ్యేలా జిల్లా అధికారులు మానిటర్ చేయాలన్నారు. జిల్లాలోని పాజిటివ్ పబ్లిక్ ఫర్ఫెక్షన్‌కు సంబంధించిన పనితీరు మరింతగా మెరుగుపడాలన్నారు. మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి జిల్లా ఫైర్ అధికారి, ఐసీడీఎస్, సివిల్ సప్లయీస్, పీసీబీ, హౌసింగ్, మైనార్టీ, డీఎంహెచ్‌ఓ శాఖల పీపీపీ శాతం పడిపోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోను పీపీపీ శాతం తక్కువ ఉండడానికి వీలులేదన్నారు. ప్రతి అధికారీ దరఖాస్తుదారు సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోతున్నారో నేరుగా వారికే ఫోన్ చేసి తెలపాలన్నారు. పాజిటివ్ శాతం 80–90కి తక్కువ కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్‌ఓ మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు రమేష్‌రెడ్డి, రామ్మోహన్, మల్లికార్జునరెడ్డి, ఆనంద్‌తోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పరిష్కార వేదికకు
126 వినతులు
అనంతపురం సెంట్రల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వివిధ సమస్యలపై 126 వినతులు అందాయి. ఎస్పీ జగదీష్ స్వయంగా వినతులు స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్ట పరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ మహబూబ్‌బాషా పాల్గొన్నారు.
విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
యాడికి: ఉద్యోగ విరమణ అనంతరం దక్కాల్సిన సౌలభ్యాలను అందజేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ ఓ విశ్రాంత ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు... యాడికి మండలంలోని రాయలచెరువు గ్రామానికి చెందిన కొండప్ప మండల కేంద్రంలోని సొసైటీ బ్యాంకులో అటెండర్‌గా పనిచేస్తూ నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి తనకు అందాల్సిన వేతన బకాయిల కోసం యాడికి సొసైటీ బ్యాంకు సీఈఓ కులశేఖర్ రెడ్డిని అభ్యర్థిస్తూ వస్తున్నారు. అయినా స్పందన లేకపోవడంతో సోమవారం ఉదయం మరోసారి సీఈఓ ను కలిసి తన సమస్య విన్నవించుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఏకరవు పెడుతూ తన వెంట తీసుకెళ్లిన క్రిమి సంహారక మందు తాగాడు. దీంతో అప్రమత్తమైన సొసైటీ సిబ్బంది కొండప్పను వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం ఆగమేఘాలపై తాడిపత్రిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.
యువరైతు ఆత్మహత్య
పెద్దవడుగూరు: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడు నివాసి నాగేంద్ర (29) తనకున్న ఐదు ఎకరాల పొలంతో పాటు మరో ఆరు ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేశాడు. ఈ క్రమంలో పంటలకు పెట్టుబడి కోసం తోటి రైతుల వద్ద, వివిధ బ్యాంకుల్లో రూ.14 లక్షల వరకు అప్పులు చేశాడు. ఆశించిన మేర దిగుబడులు రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. మరో వైపు కుటుంబ పోషణ భారమైంది. దీంతో మనస్తాపానికి గురైన నాగేంద్ర ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటి తర్వాత ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న నాగేంద్రను గమనించి వెంటనే గుత్తిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాగా, నాగేంద్రకు భార్య వెంకటలక్ష్మి, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.


