ఇద్దరిని బలిగొన్న ఓవర్‌టేక్
● బైక్‌ను ఢీకొన్న బొలెరో వాహనం
● ఇద్దరు యువకుల దుర్మరణం
గుత్తి రూరల్: అతివేగం రెండు ప్రాణాలను బలి గొంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొంది. బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. ఈ ఘటనతో గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇసురాళ్లపల్లికి చెందిన బింగి వెంకట్రాముడు, ఫకీరమ్మ దంపతుల కుమారుడు బింగి రంగస్వామి (27) వైరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇదే గ్రామానికి చెందిన సూర్యుడు కుమారుడు బెస్త పవన్ కుమార్ (24) గుత్తిలోని గేట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. వరుసకు బావాబామ్మర్ది అయిన వీరు గురువారం గుత్తిలోని పాత సీపీఐ కాలనీలో స్నేహితుడి వివాహానికి వెళ్లారు. డీజేలు, డప్పు వాయిద్యాల నడుమ రాత్రంతా స్నేహితులతో కలిసి డ్యాన్సులు చేస్తూ ఎంతో సంతోషంగా గడిపారు. దుస్తులు మాసిపోవడంతో ఇంటికి వెళ్లి మార్చుకుని వస్తామని స్నేహితులకు చెప్పి రంగస్వామి, పవన్‌కుమార్ శుక్రవారం వేకువజామున ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరారు. మార్గం మధ్యలో ఎంగిలిబండ గ్రామ శివారులో తాడిపత్రి వైపు నుంచి గుత్తి వైపు వెళ్తున్న బొలెరో వాహనం.. ముందున్న లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎగిరి రోడ్డుపై పడ్డ రంగస్వామి, పవన్‌కుమార్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బొలెరో వాహనం స్వాధీనం చేసుకుని, ఆలూరుకు చెందిన డ్రైవర్ కేశప్పను స్టేషన్‌కు తరలించారు.
ఇద్దరిని బలిగొన్న ఓవర్‌టేక్


