అంగన్‌వాడీలను విస్మరిస్తే మూల్యం తప్పదు
● కుప్పం సభలో ఇచ్చిన హామీ గుర్తుందా చంద్రబాబూ?
అనంతపురం అర్బన్: అంగన్‌వాడీల సమస్యలను విస్మరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంగన్‌వాడీలకు కుప్పం సభలో ఇచ్చిన హామీ ఏమైనా గుర్తుందా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడారు. ‘అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ ఎన్నికల ప్రచారంలో చెప్పారు. వేతనం పెంపుతో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని 2024 జూలైలో చంద్రబాబు ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చింది. రెండేళ్లవుతున్నా అందులో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదు’ అని ధ్వజమెత్తారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న మినీ వర్కర్లకు అర్హతలో సడలింపునిచ్చి ప్రధాన కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. గ్రాట్యుటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని, అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరారు. హెల్పర్ల పదోన్నతులకు సంబంధించి నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 164 సూపర్‌వైజర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. మే నెల మొత్తం వేసవి సెలువులు ప్రకటించాలన్నారు. మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా వంటగ్యాస్ ఇవ్వాలని, ప్రీ స్కూల్ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు కోశాధికారి కాత్యాయిని, నాయకురాళ్లు మేరీ, రాధా, షాహిన, పాతక్క, రమణమ్మ, రామాంజనమ్మ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.


