దండుపాళ్యం బ్యాచ్ తరహాలో అకృత్యాలు
అనంతపురం: ప్రశాంతతకు మారుపేరైన అనంతపురం నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ‘దండుపాళ్యం బ్యాచ్’ తరహాలో ప్రత్యేక ముఠా ఏర్పాటు చేసి అడ్డగోలు దోపిడీకి తెగబడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సేవ చేస్తానని, అభివృద్ధి పనులు చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఇప్పుడు దోపిడీ ముఠా నాయకుడిగా దగ్గుపాటి చలామణి అవుతున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి సమీప బంధువులను తీసుకొచ్చి నగరంలో ఒక ముఠాగా ఏర్పాటు చేసి.. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాలు, భూములను కబ్జా చేసేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎదురు తిరిగినా వారిపై దాడులు, బెదిరింపులకు దిగుతున్నారన్నారు. ఎ.నారాయణపురం పంచాయతీ పరిధిలో బుడగజంగాలకు చెందిన ఐదున్నర ఎకరాల భూమి కబ్జా చేశారన్నారు. కక్కలపల్లిలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి భరత్ బంధువులకు చెందిన మూడున్నర ఎకరాలు ఆక్రమించడానికి ప్రయత్నించారన్నారు. కోస్తా ప్రాంతం నుంచి వచ్చి శారదానగర్‌లో స్థిరపడిన ప్రొఫెసర్ కనకదుర్గ రోడ్డు ప్రమాదంలో చనిపోతే.. నకిలీ పత్రాలతో ఆమె ఇంటిని కబ్జా చేయడానికి దగ్గుపాటి బ్యాచ్ ప్రయత్నించిందని విమర్శించారు. టీడీపీకి చెందిన లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్ప కూడా బాధితురాలేనని పేర్కొన్నారు. ముడుపులు ఇవ్వలేదని టీడీపీకే చెందిన ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్‌పై దౌర్జన్యం చేశారన్నారు. ముడుపులు ఇవ్వలేదని వెంకటరమణ అనే టీడీపీ వ్యక్తికి చెందిన వైన్ షాప్‌కు నిప్పు పెట్టారన్నారు. ఇన్ని ఘటనలు జరిగినా ముఠాకు నాయకత్వం వహిస్తున్న వ్యక్తిని ఎస్పీ, డీఎస్పీ, డీఐజీలు ప్రశ్నించకపోవడం విమర్శలకు తావిస్తోందన్నారు.
దోపిడీలో చంద్రబాబు, లోకేష్‌లకూ వాటాలట!
‘ఎన్నికల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టి టికెట్ తెచ్చుకున్నాం. మరిప్పుడు సంపాదించుకోకుంటే ఎలా..? అయినా వసూళ్లు చేసిన డబ్బులో సీఎం చంద్రబాబుకు, ఆయన తనయుడు లోకేశ్‌కు వాటాలు పంపుతున్నాం’ అంటూ ‘దగ్గుపాటి బ్యాచ్’ జనంపై పడి దోచుకుంటున్నారని అనంత విమర్శించారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలే కాకుండా తాతముత్తాతల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తులను కూడా కబ్జా చేస్తున్నారని మండిపడ్డారు. థియేటర్‌లో సినిమా ప్రదర్శించాలన్నా.. నగరంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, వ్యాపారం చేసుకోవాలన్నా.. ఏదైనా కొత్త షోరూం ప్రారంభించాలన్నా ‘ఎమ్మెల్యే ఆఫీస్’ అనుమతి అనివార్యం అనే పరిస్థితి తెచ్చారని విమర్శించారు. వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేయడంతో పోలీస్ స్టేషన్లు, తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లినా ముందుగా ‘ఎమ్మెల్యే ఆఫీస్‌కు వెళ్లండ’ని సలహా ఇస్తున్నారన్నారు. లాడ్జీల్లో తమవారికి గదులు ఇవ్వకపోతే దగ్గుపాటి బ్యాచ్ దాడులకు తెగబడుతోందన్నారు. లాడ్జీల్లో పేకాట, మట్కా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులు అనంతపురంలో ‘దగ్గుపాటి బ్యాచ్’ ఎక్కడ దారి దోపిడీకి పాల్పడుతుందోనని బెంబేలెత్తిపోతున్నారన్నారు. 19 నెలలుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఆయన బంధువులు అశోక్, స్వరూప్, గంగారామ్ అరాచకాలకు పాల్పడుతుంటే ఏం చేస్తున్నారంటూ అని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించారు.
భయపడొద్దు.. అండగా ఉంటాం
అక్రమార్కులు, దౌర్జన్యపరులకు ప్రజలు భయపడాల్సిన పనిలేదని, వైఎస్సార్‌సీపీతో పాటు అనంతపురంలో ప్రశాంతత కోరుకునే అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మీకు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. ఇది పాలేగాళ్ల రాజ్యం కాదు.. తస్మాత్ జాగ్రత్త..! పోలీసులు కూడా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తొద్దు అని సూచించారు. ‘దండుపాళ్యం ముఠా’లో పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా ఉన్నారన్నారు. వాళ్ల లావాదేవీలు చూస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు.
అనంతపురంలో ఖాళీ జాగా కనిపిస్తే కబ్జానే..
ఇల్లు కట్టాలన్నా, షాపు పెట్టాలన్నా, పరిశ్రమ నెలకొల్పాలన్నా కప్పమే
దగ్గుపాటి బ్యాచ్ దౌర్జన్యాలు, అకృత్యాలతో టీడీపీ నేతలు సైతం బెంబేలు
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం


