నేత్రపర్వం.. చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం
ఉరవకొండ: చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం ఉరవకొండలో నేత్రపర్వంగా సాగింది. గురువారం ఉదయం గంగాజలాన్ని ఊరేగించి అమ్మవారిని అభిషేకించారు. వేలాది మంది భక్తజనం మధ్య అమ్మవారి జ్యోతుల ఊరేగింపు అర్ధరాత్రి 12.30 నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కొనసాగింది. తొగటవీర క్షత్రియులు పురామాను కట్ట చౌడేశ్వరి ఆలయానికి సంబంధించిన జ్యోతులను చౌడేశ్వరి కాలనీ నుంచి మేళతాళాల నడుమ ఊరేగించి ఆలయానికి చేర్చారు. కోటలోని చౌడేశ్వరి ఆలయం నుంచి దేవాంగులు జ్యోతులను పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించి తిరిగి అమ్మవారి ఆలయానికి చేర్చారు. ఊరేగింపులో వివిధ ప్రాంతాల కళాకారులు అద్భుత ప్రదర్శనలు ఇచ్చారు. అమ్మవారికి ప్రీతికరమైన ఖడ్గ పద్యాలతో స్తుతిస్తూ భక్తులు మైమరిచిపోయారు. 101 కలశాలతో మహిళలు ఊరేగింపులో పాల్గొన్నారు. జ్యోతుల వేడుకల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. దీంతో పాటు ప్రసిద్ధిగాంచిన ఉరగాద్రి చౌడేశ్వరీదేవి ఆలయాన్ని భక్తులు, ప్రముఖులు దర్శించకున్నారు. ఆలయ ధర్మకర్త కొత్త శరత్ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
101 కలశాలతో ఊరేగింపుగా వస్తున్న మహిళలు
జ్యోతులతో నృత్యం చేస్తున్న భక్తులు
నేత్రపర్వం.. చౌడేశ్వరీదేవి జ్యోతుల ఉత్సవం


