మద్యం షాపు తగలబెట్టిన కేసులో మలుపు
అనంతపురం సెంట్రల్: నగరంలో జాతీయ రహదారి పక్కన నంబూరి వైన్స్ షాప్‌కు నిప్పు పెట్టిన ఘటనలో కేసు మలుపు తిరిగింది. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కీలక నిందితుడు అఖిల్‌కుమార్‌తో పాటు మరొకరు బాబా ఫక్రుద్దీన్ శుక్రవారం నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు. తాను పెయింటింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని, ఆ రోజు మధ్యాహ్నం మందు కోసం సదరు వైన్‌షాపుకు వెళ్లి ఫోన్‌పేలో డబ్బులు వేసినా రాలేదని చెప్పడంతో నిప్పు పెట్టానని కీలక నిందితుడు చెబుతుండగా.. సీఐ జగదీష్, ఎస్‌ఐ ప్రసాద్ అడ్డుకుని, అతడిని స్టేషన్‌లోకి తీసుకెళ్లారు. నిందితులను శనివారం అరెస్టు చూపనున్నట్లు తెలుస్తోంది.
పోలీసుల తీరుపై విమర్శలు
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలు, దాడులపై బాధితులు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పోలీసులు ఆ కేసుల గురించి మాట్లాడే ధైర్యం చేయడం లేదు. డబ్బు కోసం బెదిరించడమే కాకుండా దాడి చేసిన ఘటనపై బాధితుడు ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ స్వయంగా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అలాగే నంబూరి వైన్స్ నిర్వాహకుడు వెంకటరమణ కూడా ఎమ్మెల్యే దగ్గుపాటి బెదిరించాడని, అతని అనుచరులతో తన వైన్ షాపును తగలబెట్టించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులకు సంబంధించి నాల్గవ పట్టణ పోలీసులు నోరుమెదపడం లేదు. ఎమ్మెల్యే సిఫార్సుతో పోస్టింగ్ తెచ్చుకోవడం వల్లే.. సీఐ చెప్పినట్లు నడుచుకుంటున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కేసు నీరు గార్చేందుకు కుట్రలు
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనను రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నాడు. నేను కూడా టీడీపీ కోసం పనిచేశాను. నేనెందుకు డబ్బు ఇవ్వాలని ఎదురు తిరిగినందుకే వైన్స్ షాప్‌కు నిప్పు పెట్టించాడు. నిందితులు ఎవరన్నది సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. కానీ ఫోన్ పేలో డబ్బులు వేసినా.. మద్యం ఇవ్వలేదని నిందితునితో సాకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఊరికే చెప్పడం కాదు.. నిరూపించాలి. నిష్పక్షపాతంగా విచారణ చేయించి, న్యాయం చేయాలని కోరుతూ శనివారం అంబేడ్కర్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి ఎస్పీని కలవాలని నిర్ణయించుకున్నాం.
– నంబూరి వెంకటరమణ,
నంబూరి వైన్‌షాపు నిర్వాహకుడు
పోలీసుల ఎదుట లొంగిపోయిన ఇద్దరు నిందితులు
ఫోన్‌పేలో డబ్బు వేసినా మద్యం ఇవ్వలేదని నిప్పు పెట్టానంటున్న కీలక నిందితుడు
రూ.20 లక్షలు ఇవ్వలేదని ఎమ్మెల్యేనే తగులబెట్టించాడని బాధితుడి ఆరోపణ


