‘సార్’ చెప్పాడు.. నేను కట్టేస్తున్నా !
కళ్యాణదుర్గం రూరల్: చంద్రబాబు సర్కారు కొలువు దీరాక అధికార తెలుగుదేశం పార్టీ నేతలు ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన్నేస్తున్నారు. విలువైన స్థలాలను తమ హస్తగతం చేసుకుంటున్నారు. కళ్యాణదుర్గంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధి అండతో దర్జాగా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి.. అభ్యంతరం తెలిపి, హెచ్చరికలు జారీ చేసిన రెవెన్యూ అధికారులపైనే ఓ టీడీపీ నేత హూంకరించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అర్బన్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేసింది. ఆస్పత్రి భవిష్యత్తు అవసరాల నిమిత్తం సర్వే నంబర్ 499లో 30 సెంట్ల స్థలాన్ని రిజర్వు చేసింది. ఈ స్థలం విలువ రూ.80 లక్షల దాకా ఉంది.
అదును చూసి.. కబ్జా చేసి..
రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే ప్రభుత్వాస్పత్రికి చెందిన విలువైన స్థలంపై టీడీపీ నేత కన్నుపడింది. ఎలాగైనా దక్కించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆ స్థలాన్ని ఇటీవల చదును చేసేశాడు. స్థానికులు అప్రమత్తమై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు దృష్టికి తీసుకుపోవడంతో పాటు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు స్థలాన్ని పరిశీలించి.. ఇక్కడ నిర్మాణాలు చేపడితే చట్టప్రకారం చర్యలు తప్పవని కబ్జా చేసిన టీడీపీ నేతను హెచ్చరించారు. అయితే ఆ నాయకుడు వారి మాటలను బేఖాతరు చేశాడు. రెండు రోజుల క్రితం రాత్రికి రాత్రే ఏకంగా 30 సెంట్ల విస్తీర్ణాన్ని తన ఆధీనంలోకి తీసుకుని, అందులో 20 సెంట్ల విస్తీర్ణం మేర పునాది తీసి బేస్‌మెంట్ పూర్తి చేశాడు. విషయం తెలుసుకున్న అధికారులు మరోసారి ఆ టీడీపీ నేతకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే టీడీపీ నేత దీటుగా స్పందించాడు. ‘సార్ (నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధి) చెప్పాడు కాబట్టే నిర్మాణం చేస్తున్నా. మీ పని మీరు చేసుకోండి. మీకు పంపాల్సింది పంపాను కదా’ అంటూ రెవెన్యూ అధికారులనే గదమాయించాడు.
కబ్జాకోరులకు కళ్లెం వేయరా..?
ప్రభుత్వ స్థలం దర్జాగా కబ్జా చేస్తున్నా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ఏమీ చేయకుండా చోద్యం చూస్తుండటంపై ప్రజలు మండిపడుతున్నారు. తమను గెలిపిస్తే పట్టణ పరిధిలోని పేదలకు రెండు సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో వారికి మూడు సెంట్ల చొప్పున నివేశన స్థలం మంజూరు చేసి.. నాణ్యమైన ఇళ్లు కట్టిస్తామని టీడీపీ, జనసేన ‘ఉమ్మడి మేనిఫెస్టో–2024’లో పేర్కొంది. అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వం అర్హులైన పేదలకు నివేశన స్థలాలే ఇవ్వలేదు. మరి ఇప్పుడు టీడీపీ నేత ఒక్కడే ఆస్పత్రి భవిష్యత్ అవసరాల కోసం రిజర్వు చేసిన 30 సెంట్లలో భవన నిర్మాణం కోసం పునాది వేశాడు. పట్టా కానీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ఇతర ఏ పత్రాలూ లేకపోయినా ప్రజాప్రతినిధి అండ చూసుకుని ఇలా రెచ్చిపోతుంటే అడ్డుకునే వారే లేరా అంటూ ఇందిరమ్మ కాలనీవాసులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ సారైనా స్పందించి కబ్జాకోరులకు కళ్లెం వేయాలని కోరుతున్నారు.
రాత్రికి రాత్రే బేస్‌మెంట్
ప్రభుత్వాస్పత్రి స్థలంలో దర్జాగా అక్రమ కట్టడం
అభ్యంతరం తెలిపిన రెవెన్యూ అధికారులపై టీడీపీ నేత హూంకరింపు


