21 నుంచి ఇంటర్ పరీక్షలు
● నిర్వహణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి
● అధికారులకు డీఆర్‌ఓ మలోల ఆదేశం
అనంతపురం అర్బన్: ఇంటర్మీడియెట్ పరీక్షలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయని, ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని డీఆర్‌ఓ మలోల అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై డీఆర్‌ఓ సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి (ఆర్‌ఐఓ) వెంకటరమణ నాయక్‌తో కలిసి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21న ఎథిక్స్, హ్యూమన్ వ్యాల్యూస్, 23న ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. 27 నుంచి ఫిబ్రవరి 10 వరకు ఒకేషనల్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఉంటాయన్నారు. 83 కేంద్రాల్లో జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు ఉంటాయన్నారు. వీటికి 9,900 మంది విద్యార్థులు, థియరీ పరీక్షలకు 48,146 మంది విద్యార్థులు హాజరవుతారని పేర్కొన్నారు. విద్యార్థులు నిర్ధేశించిన సమయం కంటే అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో వృత్తి విద్యాశాఖాధికారి గురవయ్య, పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు నాగరత్నమ్మ, కృష్ణమూర్తి, వెంకటస్వామి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘అక్షర ఆంధ్ర’ను
విజయవంతం చేయాలి
అనంతపురం అర్బన్: ‘అక్షర ఆంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. మానవ వనరుల అభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం విజయవాడ నుంచి వయోజన విద్య రాష్ట్ర సంచాలకుడు రంజిత్‌బాషాతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో వయోజనులందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్ధడమే ‘ఉల్లాస్ ఫేస్–1 అక్షర ఆంధ్ర’ లక్ష్యమన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో 2025–26 సంవత్సరానికి వయసు 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న 1,25,578 మంది వయోజనులను అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్ధాలన్నారు. బోధన వాచకాలతో పాటు దృశ్య, శ్రవణ వీడియోలు, అభ్యాసన పత్రాల ద్వారా బోధన జరగాలన్నారు. అధికారులు పరస్పర సహకారంతో పనిచేసి జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలన్నారు. సమావేశంలో వియోజన విద్య ఉపసంచాలకుడు వెంకటేశ్వర్లు, డీఈఓ ప్రసాద్‌బాబు, డీపీఓ నాగరాజనాయుడు, డ్వామా పీడీ సలీంబాషా, ఐసీడీఎస్ పీడీ అరుణకుమారి, డీఆర్‌డీఏ పీడీ శైలజ పాల్గొన్నారు.
21 నుంచి ఇంటర్ పరీక్షలు


