సకాలంలో పనులు పూర్తయ్యేనా?
బొమ్మనహాళ్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వరప్రదాయినిగా ఉన్న తుంగభద్ర జలాశయంలో క్రస్ట్ గేట్ల బిగింపు పనులు నత్తనడకన సాగుతున్నాయి. క్రస్ట్ గేట్లు 70 ఏళ్ల క్రితం ఏర్పాటు చేశారు. సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం గేట్ల కాలపరిమితి 45 ఏళ్లు. అనంతరం మార్చాల్సి ఉంటుంది. అయితే డ్యాం నిర్మాణం పూర్తయినన్పటి నుంచి ఇప్పటిదాకా గేట్లను మార్చలేదు. ఈ క్రమంలో గతేడాది ఆగస్టులో 19వ గేటు లింక్ చానల్ తెగి నదిలో కొట్టుకుపోగా, దాని స్ధానంలో స్టాప్‌లాగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిపుణులు మిగిలిన 32 గేట్లను కూడా పరిశీలించి, అవి కూడా ప్రమాదంలో ఉన్నాయని, అన్నీ మార్చాలని సూచించారు. దీంతో బోర్డు అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. డ్యాం నుంచి పారే అన్ని కాలువలకూ రబీలో నీటి సరఫరాను నిలిపివేసి బిగింపు పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. డ్యాం గేట్ల లెండర్ పొందిన గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్, మెషినరీ ప్రాజెక్ట్‌కు చెందిన ప్రతినిధులకు అప్పగించారు. గత ఏడాది డిసెంబర్ ఐదో తేదీన తుంగభద్ర బోర్డు ఉన్నతాధికారులు హోమాలు, ఇతర ప్రత్యేక పూజలు నిర్వహించి 33 కొత్త క్రస్ట్‌గేట్ల బిగింపు పనులు ప్రారంభించారు. గత 15 రోజుల్లో క్రస్ట్ గేట్ నంబర్ 18తో సహా మొత్తం మూడు పాత గేట్లను తొలగించారు. తొలగించిన పాత క్రస్ట్ గేట్ల స్ధానంలో క్రస్ట్ గేట్ నంబర్ 18 ఏర్పాటు మాత్రమే పూర్తయింది. కొత్తగా ఏర్పాటు చేసిన గేట్ కోసం లింక్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి.
అధికారుల నిర్లక్ష్యం
తుంగభద్ర జలాశయంలోని ఒక క్రస్ట్ గేటు ఏర్పాటుకు 15 రోజులు పడితే.. మిగిలిన 32 గేట్ల ఏర్పాటు ఎప్పుడు చేస్తారో తెలియడం లేదు. ఇప్పుటికే గేట్లు ఏర్పాటు చేసే సాకుతో కర్ణాటక, ఎల్‌ఎల్‌సీ కింద ఉన్న పంటలకు రెండవ దఫా నీరు ఇవ్వలేదు. జలాశయంలో నీరు ఉన్నప్పటికీ పంటల సాగుకు ఇవ్వకపోవడంతో రైతులు మండిపడుతున్నారు. తుంగభద్ర బోర్డు కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. నెలకు 8 గేట్లు ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇంతకుముందు టీబీ బోర్డు అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. నాలుగు నెలల్లో 33 గేట్లు ఏర్పాటు చేస్తామని ఒక నెల క్రితం చెప్పారు. అయితే కొత్త గేట్ల ఏర్పాటు ప్రారంభించి నెల గడిచినా ఇప్పటి వరకు 3 గేట్లు మాత్రమే తొలగించారు. 1 క్రస్ట్ గేటు ఏర్పాటు మాత్రమే పూర్తయ్యింది. నాలుగు నెలల్లో కొత్త గేట్ల ఏర్పాటు సందేహాస్పదంగా మారింది. కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేసి.. వర్షాకాలం హెచ్చెల్సీ, ఎల్‌ఎల్‌సీ, ఇతర కాలువల కింద ఉన్న ఆయకట్టు భూముల్లో సాగు చేసే పంటలకు నీరు అందించాలని రైతులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
● ప్రస్తుతం జలాశయంలో 1,605.12 అడుగుల నీటి మట్టంతో 28.900 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 3,837 క్యూసెక్కుల నీళ్లు వివిధ కాలువల ద్వారా బయటికి పోతున్నాయి. ఈ నెల 14 వరకు తుంగభద్ర జలాశయం నుంచి హెచ్చెల్సీకి నీళ్లు వస్తాయని బోర్డు అధికారులు తెలిపారు.
నత్తనడకన క్రస్ట్ గేట్ల బిగింపు పనులు
15 రోజుల్లో ఒకే ఒక్క క్రస్ట్ గేట్ ఏర్పాటు
4 నెలల్లో మిగిలిన గేట్ల పూర్తిసందేహమే
ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు


