మా గోడు వినండి
● ‘పరిష్కార వేదిక’లో 400 అర్జీలు
అనంతపురం అర్బన్: మా గోడు విని సమస్యలు పరిష్కరించండి అంటూ పలువురు అర్జీదారులు అధికారులను వేడుకున్నారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్, తిప్పేనాయక్, రమేష్‌రెడ్డి ప్రజల నుంచి వివిధ సమస్యలపైన, భూ సమస్యలకు సంబంధించి రెవెన్యూ క్లినిక్ ద్వారా మొత్తం 400 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్‌చార్జ్ కలెక్టర్ సమీక్షించారు. ప్రతి అర్జీకీ నాణ్యమైన పరిష్కారం చూపించడంతో పాటు అర్జీదారుకు ఎండార్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశించారు.
అర్జీల్లో కొన్ని...
● అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి పంచాయతీ సంతోష్‌నగర్‌లో నివాసముంటున్న చాకలి నాగరాజు భార్య ప్రమీలమ్మ పేరున 2009లో ఇందిరమ్మ ఇల్లు (ప్లాట్ నంబరు 68) మంజూరైంది. ఇంటి నిర్మాణం కోసం అప్పట్లో 10 బస్తాల సిమెంట్ ఇచ్చారు. దీంతో పునాది పనులు పూర్తి చేశారు. ప్రమీలమ్మ 2012లో మరణించింది. ఆమె పేరున ఉన్న ప్లాట్‌ను తన పేరుపైకి మార్చి పోజిషన్ సర్టిఫికెట్ ఇవ్వాలని నారాజు తహసీల్దారును కోరితే పట్టించుకోలేదు. అప్పట్లో జారీ చేసి డీ పట్టా హౌసింగ్ వాళ్ల వద్దే ఉంచుకున్నారు. ఒరిజినల్ డీ పట్టా ఇవ్వాలని కోరితే.. సిమెంటు బస్తాల డబ్బును వెనక్కు కట్టించుకున్నారు కానీ ఇప్పటికీ పేరు మార్పు చేయలేదు. తనకు న్యాయం చేయాలని నాగరాజు ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను కోరుతున్నారు.
● బుక్కరాయసముద్రం మండలం బోడిగానిదొడ్డి (రోటరీపురం)లో నామాల కుళ్లాయమ్మ నివాసం ఉంటోంది. ఈమె భర్త నామాల కొండన్నకు సర్వే నంబరు 95–7లో 45 సెంట్ల వ్యవసాయ భూమికి 1991లో ప్రభుత్వం డీ పట్టా ఇచ్చింది. కొండన్న 2004లో మరణించాడు. ఆయన బతికున్నప్పుడు ఆ భూమిని వేరొకరికి కౌలుకు ఇచ్చారు. కొండన్న మరణించిన తరువాత కౌలుదారు ఆ భూమిని వేరొకరికి అనధికారికంగా విక్రయించాడు. కుమార్తె నాంచారమ్మతో కలిసి కుళ్లాయమ్మ కలెక్టరేట్‌కు వచ్చి తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.


