లారీ అసోసియేషన్‌లో ‘పచ్చ’ పెత్తనం | - | Sakshi
Sakshi News home page

లారీ అసోసియేషన్‌లో ‘పచ్చ’ పెత్తనం

Jan 11 2026 7:33 AM | Updated on Jan 11 2026 7:33 AM

లారీ అసోసియేషన్‌లో ‘పచ్చ’ పెత్తనం

లారీ అసోసియేషన్‌లో ‘పచ్చ’ పెత్తనం

‘ఇంత ఫ్రాడ్‌ చేస్తుంటే అసోసియేషన్‌కు మేము రాం. నేరుగా మా బండ్లు పంపించుకుంటాం. అసోసియేషన్‌ ఉండేది నాయకులను బతికించేందుకేనా?’. ‘నాయకులంటే అందరికీ వస్తుంది. ఎవరైతే తిన్నారో వారిని మాత్రమే అనండి’. ‘మూడేళ్ల నుంచి మీరే ఉన్నారు కదా? అసోసియేషన్‌ డబ్బులు ఇలా వృథా చేస్తుంటే ఎలా? ఎవరైనా ప్రశ్నిస్తే మాట్లాడతారంటారు. మూడేళ్ల కాలంలో ఒకసారైనా మీటింగ్‌ ఏర్పాటు చేశారా.. డబ్బులు ఎక్కడ పోతున్నాయి..? ‘అసోసియేషన్‌ ముసుగులో నకిలీ చలానాలతో డబ్బులు ఎవరు వసూళ్లు చేశారు?.’

ఇవీ హెవీ గూడ్స్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ వాట్సాప్‌ గ్రూపులో కొందరు సభ్యులు పెట్టిన మేసేజ్‌లు. అసోసియేషన్‌ ముసుగులో సాగిస్తున్న దందాకు ఈ మెసేజ్‌లు అద్దం పడుతున్నాయి.

రాప్తాడు రూరల్‌: జిల్లాలోనే ‘ది అనంతపురం హెవీ గూడ్స్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌’ అతి పెద్దది. 190 మంది సభ్యులు ఉన్నారు. అసోసియేషన్‌ పరిధిలో 650 దాకా హెవీ లారీలు ఉన్నాయి. అనంతపురం రూరల్‌ కక్కలపల్లి టమాట మండీలో ఈ అసోసియేషన్‌ లారీలతోనే ప్రధానంగా లోడింగ్‌ జరుగుతాయి. అధికార తెలుగుదేశం పార్టీ అండతో అసోసియేషన్‌ను కొందరు ప్రతినిధులు తమ గుప్పిట్లో పెట్టుకున్నారనే విమర్శలున్నాయి. 10 నుంచి 12 మంది లారీల ఓనర్లు శాసిస్తున్నారని పలువురు లారీల యజమానులు వాపోతున్నారు. వీరి లారీల ద్వారానే టమాట మండీల్లో లోడింగ్‌ చేస్తున్నారు. సాధారణ ఓనర్ల లారీలు సీరియల్‌లో ఉన్నా పట్టించుకోకుండా ఆ 12 మంది లారీలకే పని కల్పిస్తున్నారు. దీనికితోడు ప్రస్తుత అధ్యక్షుడు సుమారు రూ. 3 లక్షలు అసోసియేషన్‌ సొమ్మును వ్యక్తిగతంగా వాడుకున్నాడు. అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వసూళ్లు చేస్తున్న సొమ్ము నకిలీ చలానాలతో పక్కదారి పడుతోంది. ఈ వ్యవహారాల నేపథ్యంలో కొంతకాలంగా అసోసియేషన్‌లో లుకలుకలు మొదలయ్యాయి. విభేదాలు ఇటీవల తారస్థాయికి చేరాయి. ఈక్రమంలో అధ్యక్షుడిపై తిరుగుబాటు చేశారు. రాజీనామా చేయాలని పట్టుపడుతున్నారు.

వాట్సాప్‌లో సాగుతున్న వార్‌

నకిలీ చలానాలతో సొమ్ము కాజేసిన వారెవరు, దీనివెనుక ఎవరున్నారంటూ పలువురు సభ్యులు అధ్యక్షుడిని వాట్సాప్‌ వేదికగా మెసేజీల ద్వారా నిలదీశారు. తనకు ఏమీ తెలీదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పిన ఆయన.. పోలీసులకు మాత్రం ఫిర్యాదు చేయలేదు. రాప్తాడు సీఐ శ్రీహర్షను వివరణ కోరగా.. లారీ అసోసియేషన్‌ ప్రతినిధుల నుంచి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు. కాగా మండీలో బయ్యర్ల నుంచి వసూలు చేస్తున్న ‘గూండా ట్యాక్స్‌’లోనూ అసోసియేషన్‌లో ఓ ప్రతినిధికి వాటా వస్తోందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే అధ్యక్షుడు రాజీనామా చేయాలనే డిమాండ్‌ మెజార్టీ సభ్యుల నుంచి వస్తోంది. వీలైనంత త్వరగా కొత్త కమిటీని ఎన్నుకోనున్నట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు.

అసోసియేషన్‌ కార్యాలయ ఆవరణలో లారీలు

అధికార పార్టీ అండతో కొందరి గుప్పిట్లో అసోసియేషన్‌

టమాట మండీలో కొందరికే లోడింగ్‌ అనుమతి

సామాన్య లారీ ఓనర్లకు తప్పని ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement