‘సీమపై వివక్ష తగదు’
అనంతపురం: రాయలసీమ ప్రాంతంపై పాలకులు వివక్ష చూపడం తగదని రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పి రెడ్డి నాగార్జున రెడ్డి విమర్శించారు. అనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 6 ఎత్తిపోతల ప్రాజెక్ట్‌లు, మూడు రిజర్వాయర్లు అవసరమా అని ప్రశ్నించారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజి వరకు పర్యావరణాన్ని సర్వనాశనం చేస్తూ 335 కిలోమీటర్ల మేర కరకట్ట అవసరమా అని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి గతంలో సేకరించిన 50 వేల ఎకరాలు చాలవంటూ మరో 44 వేల ఎకరాలు కావాలని రైతులను ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఏడాదిలో మూడు పంటలు పండే భూములను రాజధాని పేరుతో సర్వనాశనం చేయడం దుర్మార్గమన్నారు. రాయలసీమ ప్రాంతంలో తుంగభద్ర, కృష్ణా నదులపై ప్రాజెక్టులను నిర్మించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఉన్న అవరోధాలను అధిగమించకుండా 18 నెలలుగా కాలయాపన చేశారని, ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ సీఎంతో చేసుకున్న లోపాయికారి ఒప్పందమేనని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో పూర్తిగా తెలిసిపోయాక కూడా సిగ్గు లేకుండా సీమ ఎత్తిపోతల ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పడం దుర్మార్గమన్నారు. రాయలసీమ ప్రాంతానికి శాశ్వతంగా తుంగభద్ర, కృష్ణా నదుల నీటిని ఇవ్వకుండా కుట్ర చేయడమే పనిగా పాలకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తుంగభద్ర నదిపై శంకుస్థాపన చేసిన గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి రాయలసీమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.


