కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి బాలుడి మృతి
బ్రహ్మసముద్రం: బీటీపీ కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పోలేపల్లి వద్ద జరిగింది. వివరాలు... మండలంలోని కపటలింగన పల్లికి చెందిన మాంతేష్, వనజాక్షి దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు నితిన్ (16) రాయదుర్గం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్రవారం స్వగ్రామానికి వచ్చాడు. శనివారం గ్రామానికి చెందిన తెలిసిన వారి ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలోని చెక్ పోస్టు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బీటీపీ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలోనే నీటమునిగిన నితిన్ ఊపిరాడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కుమారుడి మృతదేహం వద్ద తల్లిదండ్రులు గుండెల విసేలా రోదించారు. ‘అప్పుడే నూరేళ్లు నిండిపోయాయా నితిన్’ అంటూ విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాలువలోకి ట్రాక్టర్ దూసుకెళ్లి బాలుడి మృతి


