విషపు నీరు తాగి 50 గొర్రెల మృత్యువాత
శింగనమల: విషపు నీరు తాగి 50 గొర్రెలు మృత్యువాత పడిన ఘటన మండలంలోని సీ.బండమీదపల్లిలో జరిగింది. వివరాలు.. సీ.బండమీదపల్లికి చెందిన నరసింహ, రాజశేఖర్, రాధాకృష్ణ, ఆకులప్ప, వెంకటరమణలు గ్రామ సమీపంలోని ఓ తోట వద్ద గొర్రెల మంద తోలారు. శనివారం తోటలో పిచికారీ చేసేందుకు రసాయనిక మందును బకెట్ నీళ్లలో కలిపి మంద సమీపంలో ఉంచారు. అటువైపు వెళ్లిన గొర్రెలు ఆ నీరు తాగాయి. సమీపంలోని పొలంలో మేత మేస్తూ ఎక్కడ పడితే అక్కడ పడిపోయాయి. గుర్తించిన కాపర్లు వెంటనే శింగనమల పశు వైద్యశాల సహాయ సంచాలకుడు డాక్టర్ పద్మనాభంకు సమాచారం అందించారు. ఆయన అక్కడికి చేరుకుని గొర్రెలకు విషం విరుగుడు మందు వేసినా ఫలితం లేకపోయింది. ఒకేసారి 50 గొర్రెలు మృత్యువాత పడడంతో బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. ఎండనక, వాననక గొర్రెలు మేపుకుంటూ జీవిస్తు న్నామని, అలాంటి తమకు దేవుడు ఎంత అన్యాయం చేశాడంటూ విలపించారు. దాదాపు రూ.10 లక్షలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


