
కన్నతల్లి కళ్ల ముందే...
● రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
గుంతకల్లు రూరల్: స్థానిక విద్యానగర్ రోడ్డు నంబర్ 1లో నివాసముంటున్న ఖాదర్‌వలి, షేక్ హాసీనా బేగం దంపతుల ఒక్కగానొక్క కుమార్తె షేక్ అఫ్రీన్ (12) స్థానిక ఓ కార్పొరేట్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతోంది. రైల్వే కాంట్రాక్టర్ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తూ ఖాదర్‌వలి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తిమ్మాపురం సమీపంలో ఉంటున్న తన తల్లిదండ్రుల ఇంటికి గురువారం మధ్యాహ్నం కుమార్తె అఫ్రీన్‌తో కలసి స్కూటీపై హసీనా బేగం బయలుదేరింది. పారిశ్రామిక వాడ సమీపంలోని చాక్‌లెట్ ఫ్యాక్టరీ వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద వేగాన్ని తగ్గిస్తూ ముందుకు పోతుండగా వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ స్కూటీని ఢీకొంది. ఘటనలో తల్లి కుడి పక్కకు ఎరిగి పడగా... అఫ్రీన్ మాత్రం ఎడమ వైపు రోడ్డుపై పడింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ బ్రేక్ వేయకపోవడంతో లారీ చక్కాలు అప్రీన్‌ను తొక్కుకుంటూ ముందుకెళ్లాయి. ఘటనలో అఫ్రీన్ సగం శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన తల్లి హసీనా బేగం షాక్ నుంచి కోలుకొని వెంటనే కుమార్తె కోసం గాలించింది. ఆమె కళ్లకు రక్తపు మడుగులో విగత జీవిగా కుమార్తె కనిపించడంతో రోదనకు అంతులేకుండా పోయింది. మాంసపు ముద్దలా మారిన కుమార్తెను గుండెలకు హత్తుకుని గుండెలవిసేలా రోదించసాగింది. విషయం తెలుసుకున్న తండ్రి ఖాదర్‌వలి కూడా అక్కడకు చేరుకుని ఆమెకు తోడవడంతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఈ దృశ్యం చూసిన వాళ్లు సైతం కంటనీరు పెట్టారు. సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్ ఎస్‌ఐ రాఘవేంద్రప్ప క్షేత్రస్థాయిలో పరిశీలించి, కేసు నమోదు చేశారు.
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన
● సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణస్వామి
అనంతపురం అర్బన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.నారాయణస్వామి ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయడం లేదని మండిపడ్డారు. గురువారం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ సహాయ కార్యదర్శులు మల్లికార్జున, రాజారెడ్డితో కలసి విలేకరులతో ఆయన మాట్లాడారు. మీటర్లు బిగిస్తే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు, లోకేష్ పిలుపునిచ్చారని, ప్రస్తుతం అధికారం చేపట్టిన తరువాత ఇదే పెద్ద మనుషులు మాట తప్పి స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. విద్యుత్ చార్జీలో పెంచబోమని, మరింత తగ్గిస్తామని ఎన్నికల్లో చెప్పి... అధికారంలోకి వచ్చిన తరువాత ట్రూఆప్ చార్జీల పేరుతో ప్రజలపై ఏకంగా రూ.15,400 కోట్లు భారం మోపారని దుమ్మెత్తిపోశారు. హామీల సాధనకు ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. జిల్లా అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో నగర కార్యదర్శి శ్రీరాములు, నాయకులు రాజేష్‌గౌడ్, రమణ, రామకృష్ణ, నారాయణస్వామి, కృష్ణుడు, తదితరులు పాల్గొన్నారు.

కన్నతల్లి కళ్ల ముందే...