
ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం
రిలే దీక్షలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’
అనంతపుర అర్బన్: ఆర్డీటీకి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ) రెన్యూవల్ మరింత ఆలస్యం జరిగితే ప్రజా ఉద్యమాన్ని చవి చూడాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి హెచ్చరించారు. ఓ పార్టీకి ప్రతినిధిగా ఈ మాట తాను చెప్పడం లేదని, జిల్లా పౌరుడిగా ఆర్డీటీ అందిస్తున్న సేవలను దగ్గరగా చూసి చెబుతున్నానని అన్నారు. ఆర్డీటీని కాపాడాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయాలనే డిమాండ్‌తో సోమవారం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అధ్యక్షతన రిలే దీక్షలు మొదలయ్యాయి. కార్యక్రమానికి అనంత వెంకట్రామిరెడ్డి సంఘీభావం ప్రకటించి, మాట్లాడారు. ఆర్డీటీ కేవలం స్వచ్చంద సంస్థ మాత్రమే కాదని, ఇక్కడి ప్రజల జీవితాల్లో ఓ భాగం.. వారి భావోద్వేగాలకు ప్రతిరూపమని అన్నారు. ఐదున్నర దశాబ్దాలుగా ఎంత మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆర్డీటీకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్ చేయకపోవడంతో సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ఇదే అంశంపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాను విజ్ఞప్తి లేఖలు రాశానని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు కూడా ఆర్డీటీ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళితే ‘మీరే కేంద్రం వద్దకెళ్లి మాట్లాడండి’ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆర్డీటీని కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. ఆర్డీటీ సేవలు ఆగితే ప్రజలే తీవ్రంగా నష్టపోతారనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ గేయానంద్, మచ్చారామలింగారెడ్డి, రవిచంద్ర, వివిధ కుల, ప్రజాసంఘాల నాయకులు చామలూరు రాజగోపాల్, కోట్ల గంగాధర్, కేవీరాజు, రామన్న, సుగమంచి శ్రీనివాసులు, బాలపెద్దన్న, టీపీరామన్న, ఐఎంఎం బాషా, జన్నే ఆనంద్, టీవీరెడ్డి, హరినాథరెడ్డి, వంశీకృష్ణ, రాచేపల్లి రామాంజినేయులు, కృష్ణారెడ్డి, సాకే గోవర్దన్, రామకృష్ణ, రాకెట్ల సూర్యనారాయణ, వరికూటి కాటమయ్య, వెంకటాపురం మారుతి, తదితరులు పాల్గొన్నారు.