
శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు
గుంతకల్లు రూరల్: హనుమజ్జయంతి ఉత్సవాల్లో భాగంగా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి వారు మంగళవారం శ్రీగంధం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు వేకువ జామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. శ్రీగంధం అలంకరణలో తీర్చిదిద్ది భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఆలయ యాగశాలలో సుందరకాండ, మన్యుసూక్త వేద పారాయణం, శ్రీరామ ఆంజనేయ మూలమంత్ర అనుష్టానాల అనంతరం మన్యుసూక్త హోమాన్ని నిర్వహించారు. సాయంత్రం స్వామివారి ఉత్సవ మూర్తిని ఆలయ ముఖ మండపంలో కొలువుదీర్చి సింధూరంతో లక్షార్చన చేపట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.
సప్లిమెంటరీ పరీక్షలు
సజావుగా జరగాలి
అనంతపురం ఎడ్యుకేషన్: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో సజావుగా నిర్వహించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. మంగళవారం అనంతపురం నగరం మారుతి నగర్‌లోని కేశవరెడ్డి స్కూల్‌లో సప్లిమెంటరీ పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 42 కేంద్రాలు ఏర్పాటు చేశారని, 11,124 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా వసతులు కల్పించాలని ఆదేశించారు. మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీఈఓ ప్రసాద్ బాబు, తహసీల్దార్ హరికుమార్ ఉన్నారు.
టీబీ డ్యాంకు 6,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
బొమ్మనహాళ్: తుంగభద్ర రిజర్వాయర్‌లో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మంగళవారం నాటికి 6,261 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండి నీటి నిల్వ 9 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర జలాశయం ఎగువ భాగంలోని ఆగుంబే, తీర్థనహళ్లి, వరనాడు, శివమొగ్గ, సాగర, శృంగేరి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద డ్యాంలోకి వచ్చి చేరుతోంది. మంగళవారం డ్యాంలో 1,633 అడుగులకు గాను 1,587.07 అడుగులకు నీటి మట్టం చేరింది. అవుట్‌ఫ్లో 2,139 క్యూసెక్కులుగా నమోదైంది.
ఏపీ ఐసెట్‌లో
93 శాతం ఉత్తీర్ణత
అనంతపురం: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్–2025 ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో మొత్తం 3,026 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,781 మంది పరీక్ష రాయగా, 2,590 మంది అర్హత సాధించారు. పురుషులు 1,401 మంది పరీక్షకు దరఖాస్తు చేయగా.. 1,304 మంది (93.08 శాతం), మహిళలు 1376 మంది దరఖాస్తు చేయగా.. 1,286 (94.67 శాతం) మంది అర్హత సాధించారు.
జెడ్పీ సమావేశానికి
హాజరుకండి
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ భవన్‌లో బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు తప్పని సరిగా హాజరుకావాలని సీఈఓ రామచంద్రారెడ్డి సూచించారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జరిగే సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల కలెక్టర్లు హాజరవుతారన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు విధిగా హాజరు కావాలన్నారు. అలాగే గత సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో రావాలన్నారు. సమావేశానికి గైర్హాజరయ్యే అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు.

శ్రీగంధం అలంకరణలో నెట్టికంటుడు