
కఠినంగా ప్లాస్టిక్ నిషేధం అమలు
అనంతపురం అర్బన్: ‘‘నగర, పట్టణ ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కఠినంగా అమలు చేస్తాం. విక్రయించే వ్యాపారులకు భారీ జరిమానాలు విధిస్తాం. ఇప్పటికే 56 మందికి నోటీసులిచ్చాం’’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ పేర్కొన్నారురు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఇంటింటి చెత్త సేకరణ పకడ్బందీగా అమలయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించరాదన్నారు. నగర, పట్టణ ప్రాంతాల్లో ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనంలోనే చెత్త వేయాలన్నారు. త్వరలో నగరంలో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని, వీరు కాలనీల్లో తనిఖీ చేస్తూ చెత్తను బయట పడేస్తున్న వారికి జరిమానా విధిస్తారన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో నెల రోజుల పాటు ‘యోగాంధ్ర–25’ కార్యక్రమాలను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. తొలి రోజు నగరంలోని ఇండోర్ స్టేడియంలో కార్యక్రమం ఉంటుందన్నారు. యోగాపై పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేస్తామన్నారు. యోగాకు సంబంధించి యాప్‌ను అందుబాటులోకి తెస్తామని, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలు అందులో రిజిస్టర్ కావాలని సూచించారు. సమావేశంలో నగర పాలక కమిషనర్ బాలస్వామి, డీఎంహెచ్‌ఓ ఈబీదేవి, డీఎస్‌డీఓ ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
వంకలు ఆక్రమిస్తే కఠిన చర్యలు
వంకలు, వాగులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ఆక్రమణలపై మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. నగర పరిధిలోని పండమేరు, తడకలేరు, నడిమివంక, మరువవంక తదితర వంకలు, వాగుల ఆక్రమణలపై సర్వే చేపట్టాలని సర్వే శాఖ అఽధికారులకు సూచించారు. ఆక్రమణదారుల ఇళ్లకు నోటీసులు అతికించడంతో పాటు చేతికి కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై జాయింట్ కలెక్టర్, ఆర్‌డీఓతో చర్చించాలన్నారు. ఎంత వర్షం వచ్చినా నగర పరిధిలోని అన్ని కాలువల్లోనూ నీరు నిలువకుండా సాఫీగా వెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. పండమేరు వంక నుంచి అనంతసాగర్ చెరువు వరకూ శుభ్రం చేయించాలన్నారు. అక్కడి నుంచి శింగనమల చెరువుకు నీరు సాఫీగా వెళ్లేందుకు అవరోధాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో జాయింట్ కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మ, ఆర్‌డీఓ కేశవనాయుడు, నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, తహసీల్దార్లు హరికుమార్, మోహన్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ వి.వినోద్‌కుమార్