
వేర్వేరు ప్రమాదాల్లో అన్నదమ్ముల మృతి
ముదిగుబ్బ: ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు ప్రమాదాల్లో చనిపోయారు. దీంతో దొరిగిల్లు క్వార్టర్స్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. స్థానికుల వివరాల మేరకు.. దొరిగిల్లుకు చెందిన రమణయ్య (46) బుధవారం వ్యవసాయ పనులకు వెళ్లి పనులు ముగిసిన తరువాత స్నానం చేసేందుకు తోట సమీపంలోని గుర్రాల మడుగులోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ప్రమాదవశాత్తూ నీట మునిగి మృతి చెందినట్లు స్థానికులు అనుమానాలు వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.
రోడ్డు ప్రమాదంలో తమ్ముడు..
నాలుగు రోజుల క్రితం రమణయ్య సోదరుడు మునికృష్ణ (45) మొలకలచెరువు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ చనిపోవడంతో దొరిగిల్లులో విషాదఛాయలు అలముకున్నాయి. రమణయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అలాగే మునికృష్ణ భార్య ఇప్పటికే చనిపోగా ఓ కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు సీఐ శివరాముడు తెలిపారు.
● నీటి మడుగులో ఒకరు.. రోడ్డు ప్రమాదంలో మరొకరు
● దొరిగిల్లులో విషాదం