
●తప్పతాగి... హల్‌చల్ చేసి
కూటమి పాలనలో తాగుబోతుల ఆగడాలకు అంతులేకుండా పోతోంది. బుధవారం రాత్రి అనంతపురంలోని రైల్వే స్టేషన్ కూడలిలో ఓ యువకుడు మద్యం మత్తులో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఒంటిపై చొక్కా విప్పేసి దర్జాగా రోడ్డుపై పడుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాడు. రాష్ట్రంలో సంపద సృష్టి అంటే యువకులను మద్యానికి బానిసలను చేయడం కాదని, ఇప్పటికై నా ప్రభుత్వం మత్తు వదిలి మద్యం విక్రయాలను కట్టడి చేయాలని ఈ సందర్భంగా అటుగా వెళుతున్న వారు వ్యాఖ్యానించడం గమనార్హం.
– సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం
మహిళ హత్య కేసులో వీడిన మిస్టరీ
ధర్మవరం రూరల్: మండలంలోని రేగాటిపల్లి పొలాల్లో గత నెల 16న దారుణ హత్యకు గురైన చిట్రా అక్కమ్మ (57) కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. వివరాలను బుధవారం స్థానిక పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మవరం రూరల్ పీఎస్ సీఐ ఎన్.ప్రభాకర్ వెల్లడించారు. రావులచెరువు గ్రామానికి చెందిన చిట్రా అక్కమ్మకు 30 సంవత్సరాల క్రితం మేడాపురం గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. దాదాపు 27 ఏళ్ల క్రితం అక్కమ్మ తన భర్త, పిల్లలను వదిలేసి ధర్మవరంలోని తిక్కస్వామి నగర్‌లో అద్దె ఇంటికి మకాం మార్చింది. ఈ క్రమంలో బతుకు తెరువు కోసం కళాజ్వోతి సర్కిల్‌లో వ్యభిచారం సాగిస్తుండేది. గత నెల 16న సాయంత్రం కళాజ్వోతి సర్కిల్‌లో విటుల కోసం వేచి ఉన్న ఆమెను స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కట్టుబడి షెక్షావలి, టీచర్స్ కాలనీలోని చౌడమ్మ గుడి వద్ద నివాసముంటున్న తలారి లోకేంద్ర ఆటోలో ఎక్కించుకుని రేగాటిపల్లి పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ అక్కమ్మతో లోకేంద్ర లైంగిక కోరిక తీర్చుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో షెక్షావలి సాయంతో అక్కమ్మ తలపై లోకేంద్ర రాయితో కొట్టి గాయపరిచాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి హతమార్చాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు కత్తితో ముఖంపై ఉన్న చర్మాన్ని తొలగించి అక్కడ నుంచి ఉడాయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డీఎస్పీ హేమంత్‌కుమార్ నేతృత్వంలో దర్యాప్తు చేపట్టి పక్కా ఆధారాలతో నిందితులను గుర్తించారు. బుధవారం ఉదయం సీతారంపల్లి వద్ద జాతీయ రహదారిపై తచ్చాడుతున్న షెక్షావలి, లోకేంద్రను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. కాగా, నిందితుల అరెస్ట్‌లో చొరవ చూపిన సీఐ ఎన్.ప్రభాకర్, ఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు బాబ్జాన్, రాజప్ప, షాకీర్, అనిల్‌కుమార్, రాఘవేంద్ర, బాలకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ చత్రూనాయక్, రామాంజినేయులను ఎస్పీ రత్న, డీఎస్పీ హేమంత్‌కుమార్ అభినందించారు.

●తప్పతాగి... హల్‌చల్ చేసి