
కొత్త పింఛన్లు మంజూరు చేయాలి
● ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్
ఉరవకొండ: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా సామాజిక భద్రతా పింఛన్ల మంజూరుపై దృష్టి సారించడం లేదని, ఫలితంగా అర్హులైన లక్షలాది మంది నిరాశ నిస్పృహలతో జీవనం సాగిస్తున్నారని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్త పింఛన్ కోసం ఎంతో మంది వితంతువులు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. అర్హులైన వీరికి పింఛన్ అందిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజురు చేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌కళ్యాణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికు లేఖలు రాసినట్లు తెలిపారు.
తల్లిదండ్రుల చెంతకు
ఇంటర్ విద్యార్థి
తాడిపత్రి టౌన్: ఇంటర్ ఫెయిల్ కావడంతో ఇంట్లో చెప్పకుండా వెళ్లిన విద్యార్థి ఆచూకీని 24 గంటల్లోపే గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. వివరాలు... తాడిపత్రి మండలం బొడాయిపల్లికి చెందిన పుల్లారెడ్డి కుమారుడు నాగవర్దన్‌రెడ్డి తాడిపత్రి లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 12న ఫలితాలు వెలువడడంతో తన ఉత్తీర్ణతను తెలుసుకునేందుకు తాడిపత్రికి వచ్చిన నాగవర్దన్‌రెడ్డి ఫెయిల్ అయినట్లుగా నిర్ధారించుకుని ఎటో వెళ్లిపోయాడు. రోజు గడిచినా కుమారుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు తెలిసిన వారి వద్ద ఆరా తీశారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫెయిల్ అయిన కుమారుడు ఏ అఘాయిత్యం చేసుకున్నాడోనని కన్నీరుమున్నీరవుతూ ఈ నెల 14న తండ్రి తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తిరుపతిలో ఉన్న నాగవర్దన్‌రెడ్డిని అక్కడి పోలీసుల సాయంతో గుర్తించి మంగళవారం రాత్రి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. బుధవారం తాడిపత్రి పీఎస్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ అనంతరం తండ్రి పుల్లారెడ్డికి అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కుమారుడిని సురక్షితంగా అప్పగించేలా చొరవ చూపిన ఎస్‌ఐ గౌస్‌బాషాకు పుల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త పింఛన్లు మంజూరు చేయాలి