గుత్తి: ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలు, గుత్తి పట్టణానికి చెందిన రుఖియాబేగం ఆదివారం శ్రీకాళహస్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. తిరుపతిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను సోమవారం వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. రుఖియా బేగంకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
మద్యం అడిగితే
ఇవ్వలేదని వ్యక్తిపై దాడి
యాడికి: తాగేందుకు మందు ఇవ్వలేదన్న అక్కసుతో ఖాళీ మద్యం బాటిళ్లతో వ్యక్తిపై దాడి చేసిన ఘటన యాడికిలో సంచలనం రేకెత్తించింది. బాధితుడు తెలిపిన మేరకు.. యాడికి మండలం కోనుప్పలపాడు గ్రామానికి చెందిన మంగల గంగాధర్ సోమవారం వ్యక్తిగత పనిపై మండల కేంద్రానికి వచ్చాడు. మధ్యాహ్నం కుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బ్రాందీ షాపులో మద్యం బాటిల్ కొనుగోలు చేసి, ఆ పక్కనే మిగిలిన వారితో కలసి తాగుతూ కూర్చొన్నాడు. అదే సమయంలో గంగాధర్‌తో ఎలాంటి ముఖపరిచయం లేని యాడికి గ్రామానికి చెందిన మహేష్ అక్కడకు చేరుకుని తనకూ తాగేందుకు మద్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇందుకు గంగాధర్ నిరాకరించడంతో మహేష్ వాగ్వాదానికి దిగాడు. దుర్భాషలాడుతూ ఆ పక్కనే పడి ఉన్న ఖాళీ మద్యం గాజు బాటిల్ తీసుకుని గంగాధర్ తలపై బలంగా బాదాడు. దీంతో గంగాధర్ తలకు తీవ్ర రక్తగాయమైంది. సమాచారం అందుకున్న గంగాధర్ సమీప బంధువు అక్కడకు చేరుకుని వెంటనే క్షతగాత్రుడిని స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించాడు. విషయం తెలుసుకున్న యాడికి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మహేష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
పేలుడు పదార్థం తిని గొర్రె మృతి
ఎన్‌పీ కుంట: అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన పేలుడు పదార్థం తిని ఓ గొర్రె మృతి చెందింది. ఎన్‌పీ కుంటకు చెందిన గొర్రెల కాపరి భాస్కర్ సోమవారం ఉదయం తన గొర్రెలను రోడ్డుకు సమీపంలోని చవట గుంతల వద్ద మేపుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై గొర్రెల కాపరులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవాలు మేపు సమయంలో నల్లమందు ఉంటలపై కాలు పెట్టినా పేలుడు ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుందన్నారు.


