రమణీయం.. రంగనాథుడి కల్యాణం
తాడిపత్రి: జయ జయ రంగనాథస్వామి నామ సంకీర్తనలు.. వేదపండితుల వేదోక్త మంత్రాల నడుమ రంగనాథుడి పరిణయ వేడుక రమణీయంగా జరిగింది. ఆలూరు కోన రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని, చైత్ర శుద్ధ పౌర్ణమి శనివారం ఉదయం మీన లగ్నంలో వేకువజామున 4.45 గంటలకు వజ్రవైఢూర్యాలు, బంగారు నగలు ధరించి రంగనాథుడు, నవ వధువుగా శ్రీదేవి, భూదేవిలు ముస్తాబయ్యారు. పండితులు వేద మంత్రాలు పఠిస్తుండగా, ఆలయ ప్రధాన అర్చకులు స్వామి వారికి యజ్ఞోపవీతం చేశారు. వెంటనే సకల దేవతల ఆశీస్సులతో వేద మంత్ర పఠనంతో శ్రీ వారు అమ్మవారికి, అమ్మవార్లు శ్రీ వారికి జీలకర్ర బెల్లం పెట్టిన తంతును కనులపండువగా జరిపించారు. మంగళ వాయిద్యాలు, సన్నాయి మేళాలు మోగుతుండగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్ల మెడలో మాంగల్యధారణ గావించారు. రంగనాథస్వామి, అమ్మవార్లకు తలంబ్రాల వేడుకను నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. సాయంత్రం స్వామి వారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలను తీసుకున్నారు. రూరల్ సీఐ లక్ష్మికాంతరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
రమణీయం.. రంగనాథుడి కల్యాణం


