అనంతపురం: నేరాల నియంత్రణకు డ్రోన్ కెమెరాలను విస్త్రృతంగా వినియోగించాలని సిబ్బందిని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశాన్ని గురువారం నిర్వహించారు. జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, ఆస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదు, ఛేదనలపై సర్కిల్ వారీగా అధికారులతో సమీక్షించారు.
సీడీ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రస్తుతం పామిడి సీఐగా పనిచేస్తున్న యుగంధర్ 2022లో రాయదుర్గం సీఐగా పనిచేశారు. ఆ సమయంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గ్యాంగ్‌ల నుంచి 24 తుపాకులు సీజ్ చేశారు. ఇందుకు గాను సీఐ యుగంధర్‌కు మంజూరైన డీజీపీ డిస్క్ అవార్డును ఎస్పీ అందజేసి, అభినందించారు.
పెనుకొండ డీఎస్పీగా నరసింగప్ప
పెనుకొండ: పెనుకొండ డీఎస్పీగా నరసింగప్ప నియమితులయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా డీఎస్పీగా నియమితులైన నరసింగప్పకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం ఉంది.
‘ఈ–శ్రమ్’లో నమోదు చేసుకోండి
అనంతపురం సిటీ: జొమాటో, అమేజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లూడాట్, ఈ–కార్ట్ తదితర ఈ కామర్స్ సంస్థల్లో పని చేసే కార్మికులు ఈ–శ్రమ్‌లో సభ్యత్వం కోసం వివరాలు నమోదు చేసుకోవాలని కార్మిక శాఖ సహాయ కార్మిక కమిషనర్ ఎస్‌ఎన్ లావణ్య సూచించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అంశంపై ఈ నెల 17వ తేదీ వరకూ జిల్లా వ్యాప్తంగా అన్ని కార్మిక శాఖ కార్యాలయాల్లోనూ అవగాహన కల్పిస్తామన్నారు. సందేహాల నివృత్తి కోసం 94925 55188 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
నేరాల నియంత్రణలో డ్రోన్ కెమెరాలను వినియోగించండి


