పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలి : కలెక్టర్
అనంతపురం అర్బన్: పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఆదేశించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ అంశంపై గురువారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డీఈఓ ప్రసాద్‌బాబు, సమగ్ర శిక్ష ఏపీపీ శైలజతో కలసి విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలన్నారు. స్థానిక శాసనసభ్యులతో మాట్లాడి ఎస్‌ఎంసీ సభ్యులు, తల్లిదండ్రులు, గ్రామస్తులను ఒప్పించి సామరస్యంగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రీ ప్రైమరీ 1, 2 పిల్లలు కచ్చితంగా ప్రభుత్వ పాఠశాల్లోనే ఒకటవ తరగతి చేరేలా తల్లిదండ్రులను ఒప్పించి 100 శాతం ప్రవేశాలు జరిగేలా చూడాలన్నారు.
పీజీ ప్రవేశాలకు వేళాయె
అనంతపురం: పీజీ ప్రవేశాలకు సన్నాహాలు మొదలయ్యాయి. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీజీ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష (పీజీ సెట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మార్కుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 వర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా ఏపీ పీజీసెట్ నిర్వహణ బాధ్యతలను తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీకి అప్పగించారు. httpr://cets.apche.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ సెట్‌కు అర్హత వివరాలు..
డిగ్రీ ఉత్తీర్ణులైన ఓసీ, బీసీ కేటగిరి విద్యార్థులకు 50 శాతం , ఎస్సీ, ఎస్టీ కేటగిరి విద్యార్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి. అబ్జెక్టివ్ విధానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలకు వంద మార్కులు ఉంటాయి. 90 నిమిషాల సమయం ఇస్తారు. నెగిటివ్ మార్కులు ఉండవు. వర్సిటీ క్యాంపస్ కళాశాలలో ఉన్న కోర్సులను మూడు కేటగిరీలుగా విభజించి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుకు తుది గడువు ఏప్రిల్ 13. జూన్ 9 నుంచి 13వ తేదీ వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు.
ఎస్కేయూలో ప్రవేశాలు..
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ పీజీ కోర్సుల్లో పీజీ సెట్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలలో ఆర్ట్స్ బ్రాంచ్‌లు 13 ఉన్నాయి. ఇందులో లా కోర్సులు లాసెట్ ద్వారా, ఎంబీఏ కోర్సులు ఐసెట్ ద్వారా భర్తీ చేస్తారు. తక్కిన 11 కోర్సులు పీజీ సెట్ ద్వారా భర్తీ అవుతాయి. సైన్సెస్‌లో 15 బ్రాంచులు ఉన్నాయి. ఎంపీఈడీ ప్రత్యేక సెట్ ద్వారా భర్తీ చేస్తారు. ఎస్కేయూ పరిధిలో 19 అనుబంధ పీజీ కళాశాలలు ఉన్నాయి. పీజీసెట్‌లో ర్యాంకులను బట్టి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
పాఠశాలల పునర్వ్యవస్థీకరణ పూర్తి చేయాలి : కలెక్టర్


