
15 మంది దాడి చేశారు
● పోలీసులకు ఫిర్యాదు చేసిన కోనా మురళీ సతీమణి శ్రీలత
గుత్తి: టీడీపీ అల్లరి మూకలు మొత్తం 15 మంది తమ ఇంటిపై దాడి చేశారని మాజీ ఎంపీపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు కోనా మురళీధర్‌రెడ్డి సతీమణి కోనా శ్రీలత మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం రాత్రి తాను ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో టీడీపీ అల్లరి మూకలు రెచ్చిపోయి తమ ఇంటిపై రాళ్లతో విరుచుకుపడ్డారన్నారు. తనకు స్వల్పగాయాలయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ప్రతాప్, ఓం ప్రకాష్, రమేష్, గోవర్దన్‌తో పాటు మరో 11 మంది దాడుల్లో పాల్గొన్నారని, ఇంటితో పాటు కారునూ ధ్వంసం చేశారని ఫిర్యాదు చేశారు. విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
వ్యక్తి దుర్మరణం
కూడేరు: మండలంలోని జాతీయ రహదారిపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన మదమంచి రఘు (35)కు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న కుమార్తెను వదిలేందుకు మంగళవారం అనంతపురానికి వెళ్లాడు. అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమైన ఆయన కూడేరు మండలం బ్రాహ్మణపల్లి వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యానికి తావివ్వొద్దు : జేసీ
అనంతపురం అర్బన్: ప్రజల సమస్యలను పరిష్కరించే క్రమంలో ఏ స్థాయిలోనూ నిర్లక్ష్యానికి తావివ్వకూడదని అధికారులను జాయింట్ కలెక్టర్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. రెవెన్యూకు సంబంధించిన అంశాలపై మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రాజెక్టులకు భూసేకరణ, భూ అప్పగింత, రీసర్వే, రెవెన్యూ సేవలు, పీజీఆర్‌ఎస్, తదితర అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రీ–సర్వే ప్రక్రియ వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలన్నారు. భూ సమస్యలు లేకుండా ఎల్‌పీఎంలు ఇవ్వాలన్నారు. జాతీయ రహదారి ‘544డి’కి సంబంధించి భూసేకరణ, భూమి అప్పగింత ప్రక్రియపై ఆరా తీశారు. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ విషయంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించాలన్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా బైండోవర్ కేసుల్లో జరిమానా అధికంగా వేసి నాటుసారా తయారీకి అడ్డుకట్ట వేయాలన్నారు. సమీక్షలో కలెక్టరేట్ భూ విభాగం సూపరింటెండెట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

15 మంది దాడి చేశారు