
కదిరి: మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కల్పించిన 4 శాతం రిజర్వేషన్‌తో ఎంతో మంది ముస్లింలకు లబ్ధి చేకూరింది. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఇంకా ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో చాలా మంది స్థిరపడ్డారు. తండ్రి బాటలోనే ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పయనిస్తున్నారు. ఎన్‌ఆర్‌సీతో ముస్లింలకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతటితో ఆగకుండా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రూ.23 వేల కోట్లు వెచ్చించారు.
జగన్ పాలనలోనే ముస్లింలకు పెద్దపీట..
గత ఎన్నికల్లో వైఎస్ జగన్ తమ పార్టీ తరపున ఏపీలో ఐదుగురు ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. వీరిలో హిందూపురం నుంచి పోటీ చేసిన ఇక్బాల్ మినహా మిగిలిన నలుగురూ గెలుపొందారు. ఇక్బాల్ ఎన్నికల్లో ఓడినప్పటికీ జగన్ ఆయనకు వరుసగా రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ముస్లిం ఆత్మగౌరవాన్ని కాపాడారు. నామినేటెడ్ పదవుల్లోనూ ముస్లింలకు పెద్దపీట వేశారు. డిప్యూటి సీఎం, మండలి డిప్యూటీ చైర్‌పర్సన్, నలుగురికి ఎమ్మెల్సీ పదవులు, వార్డు మెంబర్లు, మండల, పట్టణ, నగర స్థాయిల్లో రెండో వైస్ చైర్మన్ పదవిని సృష్టించి మరీ ముస్లింలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ఈ ఎన్నికల్లోనూ ముస్లింలకు కదిరితో పాటు మరో ఏడు అసెంబ్లీ స్థానాలను కేటాయించారు. వక్ఫ్‌బోర్డు, ముస్లిం మైనార్టీల ఆస్తుల పరిరక్షణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏకంగా జీఓ 60ని జారీ చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మసీదుల్లో సేవలందిస్తున్న ఇమాంలకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనాన్ని జగన్ సర్కార్ అందజేస్తోంది. మసీదులు, దర్గాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేశారు.
మైనార్టీలకు చంద్రబాబు మొండిచెయ్యి..
జిల్లాలో టీడీపీ గత మూడు పర్యాయాలుగా ముస్లింలకు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు. 2014లో గానీ, 2019లో గానీ, అలాగే ఈ ఎన్నికల్లోనూ ఒక్క సీటు కూడా ముస్లింలకు ఇవ్వలేదు. వరుసగా ముస్లిం మైనార్టీలకు చంద్రబాబు మొండి చెయ్యి చూపుతూ వస్తున్నారు. 2014లో కదిరి నుంచి వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొందిన అత్తార్ చాంద్‌బాషాకు మంత్రి పదవి గాలం వేసి టీడీపీలో చేర్చుకుని చివరకు పార్టీ టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు. దీంతో చంద్రబాబు మోసపూరిత వైఖరి తెలుసుకున్న ఆయన ఇటీవల సీఎం వైఎస్ జగన్ సమక్షంలో తిరిగి వైఎస్సార్‌సీపీలోకి చేరారు.
4 శాతం రిజర్వేషన్‌పై బీజేపీ కత్తి..
ముస్లింలకు అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్ ఎత్తివేస్తామని ఇప్పటికే పలుమార్లు కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. అలాగే ముస్లింలను ఇబ్బందులకు గురి చేసే కామన్ సివిల్ కోడ్‌ను పక్కాగా అమలు చేస్తామని మోదీ పేర్కొన్నారు. మోదీ, అమిత్‌షాల ప్రకటనలతో ముస్లింలలో అయోమయం నెలకొంది. ఇలాంటి తరుణంలో బీజేపీతో చంద్రబాబు చేతులు కలిపారు. ఒకవేళ ఆ కూటమి గెలిస్తే మోదీ చెప్పినట్లు బాబు నడుచుకోవాల్సిందే. ముస్లింలకు ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్ ఎత్తేస్తామన్నా.. కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామన్నా చంద్రబాబు అంగీకరించక తప్పదు.
మైనార్టీల ద్రోహి చంద్రబాబు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబుకు మైనార్టీలు గుర్తుకొస్తారు. మోదీతో చేతులు కలిపి చారిత్రక తప్పు చేశానని బాబు పలుమార్లు అనేవారు. మళ్లీ ఈ ఎన్నికల్లో బీజేపీతో జత కట్టాడు. ముస్లింలకు అమలు చేస్తున్న 4 శాతం రిజర్వేషన్ ఎత్తేస్తామని బీజేపీ అంటోంది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకున్న టీడీపీని ఎలా నమ్మాలి. సైకిల్‌కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే అవుతుంది. ప్రతి ముస్లిం ఈ విషయాన్ని గుర్తించాలి. ఎన్డీఏ కూటమిని ఓడించండి.
– మొఘల్ నూరుల్లా,
వక్ఫ్‌బోర్డు జిల్లా అధ్యక్షుడు, కదిరి
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తన మంత్రి వర్గంలో ముస్లింలకు స్థానం కల్పించలేదు. కనీసం మైనార్టీ శాఖను సైతం కేటాయించలేకపోయారు. తోఫా పేరుతో రూ.300 సరుకులిచ్చి పండుగ చేసుకోండని ముస్లింలను భ్రమ పెట్టారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింలకు జగనన్న ప్రభుత్వం ఎంతో మంచి చేసింది. ఎంతో పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.80 వేలు చొప్పున జగన్ సర్కార్ ఇస్తోంది.
– షేక్ గులాబ్‌జాన్,
హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్, కదిరి
4 శాతం రిజర్వేషన్
వైఎస్సార్ ఇచ్చిన వరం
ఆ రిజర్వేషన్‌ను ఎత్తేసేందుకు
బీజేపీ కుట్ర
అలాంటి బీజేపీతో చంద్రబాబు పొత్తు

