
కమలాపురం–కృష్ణాపురం గ్రామాల మధ్య వేసిన తారు రోడ్డు
ఏ ఊరెళ్లినా తాగునీటికి కటకట.. ఎటు చూసినా అపరిశుభ్రత.. ఎటెళ్లినా కంకర తేలి, పాడైన రహదారులు, పుటుక్కుమని తెగిపడే కల్వర్టులు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భవనాలు.. ఇదీ గత టీడీపీ హయాంలోని జిల్లా దుస్థితి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పల్లె సీమల రూపురేఖలు మారిపోయాయి. జిల్లా పరిషత్‌కు పాలక వర్గం ఏర్పాటైన రెండేళ్లలోనే అభివృద్ధి పరుగులు తీసింది. ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనిస్తోంది. అన్ని హంగులతో పల్లె సీమలు అలరారుతున్నాయి.
● జిల్లా పరిషత్ పరిధిలో రెండేళ్ల వ్యవధిలో అభివృద్ధి పనులకు రూ.28.54 కోట్లు
● రూ.7.62 కోట్ల సాధారణ నిధులతో వివిధ పనులు
● పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలకు రూ.8.40 కోట్లు
● రహదారులు, కల్వర్టులు, భవన మరమ్మతులకు రూ.12.52 కోట్లు
అనంతపురం సిటీ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. జెడ్పీ చైర్‌పర్సన్‌గా గిరిజమ్మ పగ్గాలు చేపట్టిన తర్వాత గ్రామాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఫలితంగా గత 20 ఏళ్లల్లో జరగని అభివృద్ధి కేవలం రెండేళ్లలోనే సాధ్యమైంది. ప్రజల అవసరాలను గుర్తించి, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కారానికి ఆమె చూపుతున్న చొరవ ఫలితంగా మౌలిక సదుపాయాలు సమకూరుతున్నాయి.
ప్రమాణస్వీకారం రోజు నుంచే..
2021, సెప్టెంబర్ 25న జెడ్పీ చైర్‌పర్సన్‌గా గిరిజమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది అక్టోబర్, 10 నుంచి అధికారిక బాధ్యతలు చేపట్టారు. వెనువెంటనే 63 మండలాల జెడ్పీటీసీ సభ్యులను సమన్వయం చేసుకుని మండలాల వారీగా సమస్యలను నివేదిక రూపంలో తెప్పించుకున్నారు. వాటిని ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు.
రూ.కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు
అక్షర క్రమంలోనే కాదు.. వైశాల్యంలోనూ పెద్ద జిల్లాగా గుర్తింపు పొందిన ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ఒకప్పుడు సమస్యలూ అధికమే. వీటన్నింటినీ అధిగమించేలా జగన్ సర్కార్ జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు రూ. కోట్ల మేర నిధులు మంజూరు చేస్తూ వచ్చింది. ప్రజాధనంలో ప్రతి పైసాకు జెడ్పీ చైర్‌పర్సన్ జవాబుదారీగా ఉంటూ అభివృద్ధి పనులను పారదర్శకంగా పూర్తి చేయిస్తూ వచ్చారు. జనరల్ ఫండ్ సహ 15వ ఆర్థిక సంఘం కింద రూ.7.62 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశారు. పారిశుద్ధ్యం, తాగునీటి అవసరాలకు రూ.8.40 కోట్లు వెచ్చించారు. మరో రూ.12.52 కోట్లతో రహదారులు లేని గ్రామాలకు రోడ్లు వేయించారు. కల్వర్టులు నిర్మించారు. పాడైన రహదారులు, కల్వర్టులకు మరమ్మతులూ చేయించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ భవనాల మరమ్మతుకూ చర్యలు చేపట్టారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో..
జిల్లా సమగ్రాభివృద్ధిలో ఉమ్మడి జిల్లాలోని జెడ్పీటీసీలు, కో–ఆప్షన్ సభ్యులు, ప్రభుత్వాధికారులు, ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుని ముందుకు సాగడంతో జెడ్పీ చైర్‌పర్సన్ గిరిజమ్మ అన్నివిధాలా సక్సెస్ అయ్యారు. పరస్పర సహకారంతో అభివృద్ధికి బాటలు వేశారు. మండలాల వారీగా జెడ్పీటీసీలను పిలిపించుకుంటూ ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. ఆయా పనుల పూర్తికి అధికారులతో నివేదికలు తెప్పించుకుని నిధులు మంజూరు చేస్తూ వెళ్లారు.
మరింత అభివృద్ధికి ప్రణాళిక
గిరిజమ్మ పదవీ కాలం మరో మూడేళ్లు ఉంది. ఈ మూడేళ్లలో ఏమేం అభివృద్ధి పనులు చేపట్టాలనే అంశాలను ఇప్పటికే ఆమె సిద్ధం చేసుకున్నారు. ఆయా పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు, వాటిని సమీకరించుకోవడంపై ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నారు.
‘అనంత’దే అగ్రస్థానం
రాష్ట్రంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధిలో దూసుకుపోతోంది. అధికారులు, జెడ్పీటీసీ సభ్యుల సహకారం మరువలేను. ముఖ్యంగా జిల్లా సమస్యలను ప్రస్తావించి, అదనపు నిధులు అడిగినప్పుడల్లా సానుకూలంగా స్పందిస్తూ వచ్చిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటా. రాబోవు మూడేళ్లలో జిల్లాలో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తాం.
– గిరిజమ్మ, జెడ్పీ చైర్‌పర్సన్

పామిడి మండలం వంకరాజుకాలువలో ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ట్యాంక్
