ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలి

- - Sakshi

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు

ప్రతిజ్ఞ చేస్తున్న వైద్య విద్యార్థులు

అనంతపురం సప్తగిరి సర్కిల్‌: ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించేందుకు వైద్యులు కృషి చేయాలని లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ పిలుపునిచ్చారు. వివిధ రుగ్మతలతో బాధపడే రోగులకు పూర్తిస్థాయిలో సాంత్వన చేకూర్చినప్పుడే వృత్తికి సార్థకత చేకూరుతుందని పేర్కొన్నారు. అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆడిటోరియంలో బుధవారం రాత్రి 2017 బ్యాచ్‌ వైద్య విద్యార్థుల స్నాతకోత్సవం కనుల పండువగా సాగింది. ఈ కార్యక్రమానికి జయప్రకాష్‌ నారాయణతో పాటు ఇన్‌కంట్యాక్స్‌ డిప్యూటీ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రఘునందన్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శ్రీదేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షారోన్‌ సోనియా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ నారాయణ మాట్లాడుతూ వైద్యుల ప్రధాన కర్తవ్యం సమాజానికి ఉపయోగపడడమేన్నారు. ప్రస్తుత సమాజంలో వివిధ రోగాలతో బాధపడుతున్నవారు అనేకమంది ఉన్నారని, వారందరికీ వైద్యాన్ని చేరువ చేసేందుకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. వృత్తిలో నైపుణ్యం సాధించినప్పుడు మాత్రమే ఉన్నతంగా రాణించగలరన్నారు. వైద్య విద్య అభ్యసించడమే కాకుండా.. ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ కూడా పెంపొందించుకోవాలని సూచించారు. నేడు ఆరోగ్య వ్యవస్థలో అనేక మార్పులు వస్తున్నాయని, వాటికనుగుణంగా నైపుణ్యత సాధించి ఉత్తమ వైద్యులుగా ఎదగాలని సూచించారు. ఆరోగ్య వ్యవస్థను బాగుచేసే బాధ్యతను మీరు తీసుకోవాలన్నారు. అలాగే తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. వైద్య కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తోడ్పాటు అందించాలన్నారు. డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తల్లిదండ్రులు అందించే ప్రోత్సాహమే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తుందన్నారు. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. సమయస్ఫూర్తి, వృత్తి నైపుణ్యం, సత్ప్రవర్తనతో ముందుకు సాగాలన్నారు. అనంతరం కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ షారోన్‌ సోనియా, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యం వైద్య విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 2017 బ్యాచ్‌కు చెందిన 100 మంది వైద్య విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ముఖ్య అతిథులు అందించారు. కార్యక్రమంలో 2019 బ్యాచ్‌ విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రొగ్రాం ఆఫీసర్‌ పరదేశినాయుడు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆ దిశగా వైద్యులు కృషి చేయాలి

రోగులకు సాంత్వన కల్గించినప్పుడే వృత్తికి సార్థకత

నైపుణ్యంతోనే రాణించగలరు

లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ

ఘనంగా మెడికల్‌ కళాశాల స్నాతకోత్సవం

Read latest Ananthapur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top