సెక్యూరిటీ విభాగంపై ఫిర్యాదుల వెల్లువ
వేధింపులు తాళలేక ఇటీవల ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా గార్డు
తాజాగా కలకలం రేపుతున్న లైంగిక వేధింపుల ఫిర్యాదు వ్యవహారం
కీచక సెక్యూరిటీ ప్రతినిధిపై ఈగవాలనివ్వని కేజీహెచ్ అధికారులు
కేజీహెచ్ సెక్యూరిటీ..
సాక్షి, విశాఖపట్నం: కంచే చేను మేసిన చందంగా విశాఖ కేజీహెచ్‌కు రక్షణ కల్పించాల్సిన సెక్యూరిటీ విభాగమే ఇప్పుడు ఆస్పత్రి పాలిట శాపంగా మారిందనడానికి ఈ ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణలు.. నిబంధనలకు పాతరేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధి సాగిస్తున్న అరాచకాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. జీతాలడిగితే పొట్టకొట్టి ఓ మహిళా గార్డును ఆత్మహత్యాయత్నం దాకా ఉసిగొల్పినా.. ఆకలి కేకలతో కార్మికులు నిత్యం రోడ్డెక్కుతున్నా.. చివరకు ప్రాణాలు పోసే మహిళా వైద్యులపైనే సదరు కీచక ప్రతినిధి వేధింపులకు తెగబడినా కేజీహెచ్ ఉన్నతాధికారులు తమకేం కనిపించడం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ కీచక ప్రతినిధిపై ఈగవాలనివ్వకుండా అధికారులు వత్తాసు పలుకుతుండటం చూస్తుంటే, ఈ అక్రమాల వెనుక ఉన్న ఉన్నతాధికారులకు.. సెక్యూరిటీ ప్రతినిధికి ఉన్న ‘అదృశ్య’ బంధం ఏమిటన్న అనుమానాలు బలపడుతున్నాయి.
జీతాలివ్వండని అడిగినా తప్పేనా.?
కేజీహెచ్ సెక్యూరిటీ ఏజెన్సీ మూడు నెలలుగా గార్డులకు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదు. అదేవిధంగా ప్రభుత్వ ఒప్పందం ప్రకారం రావాల్సిన రూ.18,600 వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్ సౌకర్యాల గురించి ప్రశ్నించినందుకు కక్షసాధింపు చర్యలకు దిగుతోంది. తమ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలో పాల్గొన్నారనే కారణంతో ముగ్గురు మహిళా గార్డుల్ని ఇటీవల విధుల నుంచి తొలగించేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సంతోషి అనే గార్డు ఇటీవల నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి ఉద్యోగులు వెంటనే స్పందించడంతో ప్రాణాపాయం కలగలేదు. రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విధులకు అనుమతించకపోవడం, పనిచేస్తున్న వారికి సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ సమస్యలపై పలుమార్లు సీఐటీయూ ఆధ్వర్యంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా ఏజెన్సీ తీరులో మాత్రం మార్పు రావడం లేదు.
అధికారుల అండదండలున్నాయా..?
ఒకవైపు చిరుద్యోగుల వేధింపుల పర్వం కొనసాగుతుండగానే, సదరు సెక్యూరిటీ ఏజెన్సీ ప్రతినిధి వ్యవహారం ఆస్పత్రిలో పెను దుమారం రేపుతోంది. సదరు కీచక ప్రతినిధి ఏకంగా ఆస్పత్రిలోని మహిళా వైద్యుల విషయంలోనూ ఇదే రీతిలో వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలిసినా కేజీహెచ్ యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా ‘డోంట్ కేర్’ అన్నట్లుగా వ్యవహరించడం విమర్శలకు దారితీస్తోంది. గార్డులను తొలగించిన విషయంలో మేము ఎవరినీ తీసేయలేదని అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారే తప్ప ఏజెన్సీని ప్రశ్నించడం లేదు. చివరకు మహిళా వైద్యులు లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసినా ఆ కీచక ప్రతినిధిపై ఈగవాలనివ్వకుండా అధికారులు కాపాడుతుండటంతో, ఆస్పత్రిలో తమకు అసలు రక్షణ ఉందా అని మహిళా సిబ్బంది, వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సెక్యూరిటీ గార్డుల నిరసన (ఫైల్)


