కై లాసగిరిపై స్కూల్‌ బస్సు బోల్తా | - | Sakshi
Sakshi News home page

కై లాసగిరిపై స్కూల్‌ బస్సు బోల్తా

Nov 29 2026 2:17 PM | Updated on Nov 29 2026 2:17 PM

ఆరిలోవ: కై లాసగిరి ఘాట్‌ రోడ్డులో బ్రేకులు ఫెయిలై ప్రైవేట్‌ పాఠశాల బస్సు బోల్తాపడింది. లోయలోకి జారిపడకుండా చెట్లు అడ్డుకోవడంతో బస్సులోని 37 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడు స్వల్పంగా గాయపడ్డారు. పిఠాపురంలోని శ్రీ ఆదర్శ ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌కు చెందిన ఎనిమిది బస్సుల్లో 400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది శనివారం విహారయాత్రకు విశాఖ వచ్చారు. కై లాసగిరి సందర్శన అనంతరం జూ పార్కుకు బయలుదేరగా.. చివరగా వెళ్తున్న ఎనిమిదో బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. మొదటి మలుపు వద్ద ఘాట్‌ రోడ్డు గోడను ఢీకొని లోయ వైపు బోల్తాపడింది. అయితే చెట్లను ఢీకొని అక్కడే నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులోని వారంతా భయంతో కేకలు వేస్తూ కిందకు దిగారు. తెలుగు ఉపాధ్యాయుడు పి.గంగాధర్‌, విద్యార్థులు డి.సాత్విక్‌, కె.జగదీష్‌, పి.ఆశ్రిత్‌కుమార్‌కు గాయాలయ్యాయి. పోలీసులు, వీఎంఆర్‌డీఏ అధికారులు క్షతగాత్రులను మెడికవర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. డ్రైవర్‌ కోటయ్య నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని ఉపాధ్యాయుడు గంగాధర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌, ద్వారకా ఏసీపీ మల్లేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

నలుగురు విద్యార్థులు, ఉపాధ్యాయుడికి స్వల్ప గాయాలు

లోయలోకి దూసుకెళ్లకుండా అడ్డుకున్న చెట్లు

తప్పిన పెను ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement