మునగపాక : సందట్లో సడేమియా అన్న చందంగా మారింది మట్టి అక్రమార్కుల తీరు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అధికారులు బిజీగా ఉండడంతో అక్రమ వ్యాపారం చేసేందుకు ఇదే అదనుగా మట్టి అక్రమ తవ్వకాలు చేపడుతూ ఆదాయం అర్జిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని నాగులాపల్లిలో కొంతమంది కాలువ గట్టును తవ్వేసి మట్టిని తరలించుకుపోతున్నారు. రెవెన్యూ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా లారీలపై మట్టి తరలిస్తున్నా నిరోధించడంలో అధికారులు విఫలమవుతున్నారంటూ గ్రామస్తులు వాపోతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎవరూ తమవైపు చూసే పరిస్థితులు లేవని గమనించిన అక్రమార్కులు మట్టి తవ్వకాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్న వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పట్టించుకోని అధికారులు


