అథ్లెటిక్స్‌ పోటీల్లో ఏఎంసీ ఓవరాల్‌ చాంప్‌ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ పోటీల్లో ఏఎంసీ ఓవరాల్‌ చాంప్‌

Nov 29 2026 2:17 PM | Updated on Nov 29 2026 2:17 PM

మహారాణిపేట: డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన 24వ అంతర్‌ కళాశాల అథ్లెటిక్స్‌ పోటీలు (పురుషులు, మహిళలు) 2026–27లో ఆంధ్రా మెడికల్‌ కళాశాల (ఏఎంసీ) ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. గత రెండు రోజులుగా ఆంధ్రా మెడికల్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ పోటీలు శనివారం ముగిశాయి. ముగింపు వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె.వి.ఎస్‌.ఎం. సంధ్యాదేవి, మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.రాధ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సంధ్యాదేవి మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన అద్భుతమైన క్రీడా విజయాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కళాశాల పురుషులు, మహిళల విభాగాల్లో కలిపి 18వ సారి ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించడం గర్వకారణమన్నారు. పురుషులు, మహిళల వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ టైటిళ్లను కూడా ఏఎంసీ విద్యార్థులే కై వసం చేసుకోవడం అభినందనీయమన్నారు. మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ టి.రాధ మాట్లాడుతూ వైద్య విద్యార్థుల దైనందిన జీవితంలో క్రీడలు, శారీరక వ్యాయామాల ప్రాముఖ్యతను వివరించారు. ఆరోగ్యంగా, శారీరక దృఢత్వంతో ఉండేందుకు ప్రతిరోజూ తమ దినచర్యలో క్రీడలకు తగిన ప్రాధాన్యమివ్వాలని సూచించారు. పురుషుల వ్యక్తిగత విభాగంలో 2024 బ్యాచ్‌కు చెందిన ఎం.మనీష్‌ 18 పాయింట్లతో చాంపియన్‌గా నిలవగా.. మహిళల విభాగంలో అదే బ్యాచ్‌కు చెందిన బి.సంజన 23 పాయింట్లతో వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ సాధించారు. పురుషులు, మహిళల విభాగాల్లో విద్యార్థులు కనబరిచిన అసాధారణ ప్రతిభ కళాశాలకు కీర్తిప్రతిష్ఠలు తీసుకువచ్చిందని, క్రీడా చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించిందని ప్రిన్సిపల్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సెక్రటరీ డాక్టర్‌ ఈ.తిరుమూర్తి, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ ఆర్‌.సునీల్‌కుమార్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎం.ఎస్‌.ఎన్‌.పాత్రుడు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ సెక్రటరీ డాక్టర్‌ జి.నేతాజీ స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథులు, ప్రముఖులు, క్రీడా అధికారులు, క్రీడాకారులకు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement