మత్తు ఉచ్చులో యువత
రెండేళ్లలో విపరీతంగా పెరిగిన గంజాయి కేసులు
ఏజెన్సీ నుంచి నర్సీపట్నం, నాతవరం మీదుగా అక్రమ రవాణా
ఆపరేషన్ వజ్ర ప్రహర్ పేరిట పోలీసుల కార్డన్‌సెర్చ్‌ల నిర్వహణ
అనుమానితులకు గంజాయి టెస్టులు
చమ్మచింత, కురువాడ గ్రామాల్లో ఒక యువకుడికి పాజిటివ్
గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు తొలగింపు
ఈగల్ విభాగం 5 స్టాటిక్, 38 డైనమిక్ చెక్‌పోస్టుల ద్వారా తనిఖీ అంతంత మాత్రమే
ఉమ్మడి జిల్లాలో గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది జులై వరకు.. పట్టుబడ్డ గంజాయి 29,898 కిలోలు నమోదైన కేసులు 413 అరెస్టయిన వారు 1245 మంది
పెదగొలుగొండపేట వద్ద తొలగించిన పోలీసు చెక్‌పోస్టు వద్ద నిరుపయోగంగా స్టాప్ గేట్. (ఇన్‌సెట్) చెక్‌పోస్టు వద్ద ఐరన్ షెడ్డు తొలగించడంతో తుప్పల్లో దర్శనమిస్తున్న మరుగుదొడ్డు బేసిన్
సాక్షి, అనకాపల్లి : ఏజెన్సీ టు నేషనల్ హైవే...వయా అనకాపల్లి జిల్లా...గంజాయి గుప్పుమంటోంది. అల్లూరి జిల్లాలో కొయ్యూరు, పాడేరు, చింతపల్లి, జీకే వీధి, జి.మాడుగుల మండలాల పరిధిలో సాగు చేసే గంజాయిను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం, నాతవరం, గొలుగొండ, రోలుగుంట మండలాల మీదుగానే విశాఖకు, ఇతర నగరాలకు గుట్టుగా రవాణా చేస్తున్నారు. ఏజెన్సీలో ఈ ప్రాంతల నుంచి గంజాయిని నర్సీపట్నం మీదుగా రవాణా చేస్తే ఆ మార్గంలో చెక్‌పోస్టులు ఉండడంతో గంజయి స్మగ్లర్లు ఆ దారి కాకుండా నాతవరం మండలంలో పెద గొలుగొండ పేట మీదుగా అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇది గుర్తించి చెక్ పోస్టును ఏర్పాటు చేశారు. ఆ తరువాత గంజాయి ఈ మార్గం ద్వారా రవాణా అవ్వడం తగ్గింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత అక్కడ చెక్ పోస్టు తీసేయడంతో ఆ మార్గాన గంజాయి అక్రమ రవాణా సాగుతుంది. ఈ మార్గాన అనుకుని ఉన్న గ్రామాల్లో ఉన్న యువతే టార్గెట్‌గా గంజాయి స్మగ్లర్లు గంజాయి అక్రమ రవాణా చేయిస్తున్నట్టు సమాచారం. కొంత మంది ఆకతాయిలతో స్నేహం చేసి గంజాయికి అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఏజెన్సీలో ఏఓబీ ప్రాంతంలో కూడా ప్రస్తుతం గంజాయి సాగు పెరిగింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో డ్రోన్‌ల సాయంతో 7,515 ఎకరాల్లో గంజాయి సాగు గుర్తించి ధ్వంసం చేశారు. కూటమి ప్రభుత్వంలో గంజాయి సాగు మళ్లీ విచ్చలవిడిగా జరుగుతుంది.
పెదగొలుగొండ పేట చెక్‌పోస్టు కీలకం..
నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గంజాయి నిర్మూలించేందుకు ప్రత్యేకంగా పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తే ..నేటి కూటమి ప్రభుత్వం చెక్‌పోస్ట్‌నే ఎత్తేసింది. నాతవరం మండలంలో ఏటు అవతల గ్రామాలకు వెళ్లే మార్గంలో పెద గొలుగొండపేట గ్రామ సమీపంలో పోలీసులు ప్రత్యేకంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అప్పటి నర్సీపట్నం ఏఎస్పీగా పని చేసిన ఆర్.రిషాంత్‌రెడ్డి అధ్వర్యంలో రూ.3 లక్షలు వ్యయంతో పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి గంజాయి ఆక్రమ రవాణా అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ చెక్‌పోస్టు వద్ద ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించి 24 గంటలు గంజాయి అక్రమ రవాణాపై నిఘా పెంచారు. అదేవిధంగా పోలీసులు రాత్రింబవళ్లు ఉండేందుకు ప్రత్యేకంగా షెడ్డు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ రోడ్డులో ప్రయాణించే వారి కదలికలను నర్సీపట్నం ఏఎస్పీతో పాటు జిల్లా ఎస్పీ నేరుగా పర్యవేక్షించే చర్యలు చేపట్టారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ చెక్‌పోస్టు ఎత్తేశారు. ఎత్తేసిన మరుక్షణం నుంచే అల్లూరి సీతారామరాజు జిల్లాలో గల చింతపల్లి, కోయ్యూరు, గూడెంకోత్తవీధి మండలాల నుంచి ఈ ప్రాంతం మీదుగా గంజాయి అక్రమ రవాణా తిరిగి ఊపందుకుంది.
హైవేకు షార్ట్ కట్ రూట్..
ఏజెన్సీలో కొయ్యూరు, జీకే వీధి, చింతపల్లి ప్రాంతాల నుంచి గంజాయి ఎటువంటి చెక్‌పోస్టులు లేకుండా అత్యంత తక్కువ దూరంతో కాకినాడ జిల్లా తునిలో ఉన్న హైవేకు చేరుకోవచ్చు. పెదగొలుగొండ పేట మీదుగా తుని–నర్సీపట్నం బైపాస్ రోడ్డులో కోటనందూరు మీదుగా తుని హైవేకు చేరుకుంటారు. తుని రైల్వే స్టేషన్ నుంచి ఇతర మార్గాలకు అక్రమ రవాణా, లేదంటే జాతీయ రహదారి మీదుగా విశాఖపట్నానికి రవాణా జరుగుతుంది. మూడు జిల్లాలకు కేంద్ర బిందువుగా ఉన్న నాతవరం మండలం మీదుగానే గంజాయి అక్రమ రవాణాకు రాజమార్గంలా స్మగ్లర్లు ఉపయోగించుకుంటున్నారు. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలను అనుసంధానిస్తూ ఉన్న నాతవరం మండలంలో పోలీసులు చెక్‌పోస్టులు పెంచి నిఘా పెంచితే అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని స్థానిక ప్రజలు సైతం సూచిస్తున్నారు. గతంలో ఇక్కడ పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేయడంతో గంజాయి రవాణా చేసే స్మగ్గర్లకు చెక్ పడింది. గతంలో పోలీసు చెక్‌పోస్టు ఉండే ప్రదేశంలో ప్రస్తుతం చెక్‌పోస్టు ఎత్తివేసి, అక్కడ ఏర్పాటు చేసిన ఐరన్ షెడ్డు మెటీరియల్ తరలించేశారంటూ స్థానిక ప్రజలు సైతం ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
పరవాడలో రూ.1.06 కోట్ల విలువైన 213.36 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్న పోలీసులు (ఫైల్)
జూన్ 5న అనకాపల్లి టౌన్ పరిధిలోని బీఆర్‌టీ కాలనీలో మెగా కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు (ఫైల్)
జిల్లాలో విచ్చలవిడిగా గంజాయి అక్రమ రవాణా
గడచిన ఏడాదిలో 413 కేసులు
ఉమ్మడి జిల్లాలో గత ఏడాదిలో 29,898 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 413 కేసులు నమోదు చేసి 1245 మందిని అరెస్ట్ చేశారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 64,823 కిలోల గంజాయి ధ్వంసం చేయగా, అనకాపల్లి జిల్లాలో 459 కేసుల్లో 34,818 కిలోల గంజాయి, 39.04 కిలోల హషీష్ ఆయిల్‌ను, అలాగే అల్లూరి జిల్లాలో 255 కేసుల్లో 30,005 కిలోల గంజాయి, 35.35 కిలోల హాషీష్ ఆయిల్‌ను ధ్వంసం చేశారు. ఈగల్ విభాగం 5 స్టాటిక్, 38 డైనమిక్ చెక్‌పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కార్డన్ సెర్చ్... ర్యాపిడ్ కిట్‌లతో టెస్ట్
–నాతవరం మండలంలో చమ్మచింత, కురువాడ గ్రామాల్లో ఆదివారం పోలీసులు ’ఆపరేషన్ వజ్ర ప్రహార్’ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డన్ సెర్చ్ చేపట్టారు. గంజాయి పెడ్లర్‌లను గుర్తించేందుకు గంజాయి ర్యాపిడ్ కిట్లతో 15 మందికి పరీక్షలు చేయగా ఒకరికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వ్యక్తికి 18 ఏళ్లు యువకుడుగా గుర్తించారు. పదో తరగతి వరకూ చదువుకున్నాడు. అమ్మ చనిపోవడంతో చదువు నిలిపివేశాడు. ఆకతాయిలతో స్నేహం..గంజాయి సేవించడం..దానికి అలవాటు పడడం జరిగింది. గతంలో కొన్ని నెలల క్రితం కురువాడ, చమ్మచింత గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా చేసే గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రెండు గ్రామాల్లో యువత గంజాయి మత్తు ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నెల 30న ఆదివారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో 1 సీఐ, 8 ఎస్‌ఐలు, 56 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ చేపట్టారు. ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 300 ఇళ్లు, 600 మందిని తనిఖీ చేసి, రికార్డులు లేని 35 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు.


