పోలవరం ఎడమ కాలువ జలహారతి ప్రదేశాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్, ఏస్పీ
పాయకరావుపేట : సీఎం చంద్రబాబు ఈనెల 2న పాయకరావుపేటకు రానున్నారు. పోలవరం ఎడమ కాలువ వద్ద గోదావరి జలాలకు జలహారతి సమర్పించనున్నారు. అనంతరం పీఎల్ పురంలో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం చంద్రబాబు ఈనెల 2న బుధవారం ఉండవల్లిలో గల తన నివాసం నుంచి బయలుదేరి మధ్యా హ్నం 2.30 గంటలకు పాయకరావుపేట పి.ఎల్ పురానికి చేరుకుంటారు. అక్కడ నుంచి పోలవరం లెప్ట్ మెయిన్ కెనాల్ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3.30 నుంచి 5.20 గంటల వరకూ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం హెలికాప్టర్‌లో ఉండవల్లికు వెళ్లనున్నారు.
సీఎం పర్యటన దృష్ట్యా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ఏర్పాట్లు పరిశీలించారు. ఎస్పీ తుహిన్ సిన్హా మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముగ్గురు అదనపు ఎస్పీలు, 9 మంది డీఎస్పీలు , 36 మంది సీఐలు, 90 మంది ఎస్‌ఐ లు, 150 మంది ఏఎస్‌ఐలు, 427 మంది కానిస్టేబుళ్లు, 150 మంది మహిళా కానిస్టేబుళ్లు, 249 మంది హోం గార్డులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు.


