తాత్కాలిక పనులతో మమ అనిపించారు... | - | Sakshi
Sakshi News home page

తాత్కాలిక పనులతో మమ అనిపించారు...

Sep 1 2026 1:01 AM | Updated on Sep 1 2026 1:01 AM

● అరకొరగా ఏలేరు కాలువ అనుసంధాన పనులు ● కాలువ లైనింగ్‌ పనులు లేకుండానే నీటి విడుదలకు ఏర్పాట్లు

కశింకోట: మండలంలోని తాళ్లపాలెం సంత వద్ద పోలవరం ఎడమ కాలువ అనుసంధాన పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. అయినప్పటికి నీటికి అవరోధం లేకుండా అందించడానికి అనువుగా పూర్తి చేశామని అధికారులంటున్నారు. పోలవరం కాలువను ప్రస్తుతం విశాఖకు తాగునీటిని సరఫరా చేస్తున్న ఏలేరు కాలువతో ఇక్కడ అనుసంధానం చేశారు. తాత్కాలిక పనులు మాత్రమే నిర్వహించి పనులు అయిపోయినట్లు మమ అనిపించారు. ఇంకా పలు మిగిలిన పనులు నిర్వహించాల్సి ఉంది. శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టకపోవడం వల్ల పోలవరం నీరు విడుదల చేస్తే ప్రవాహానికి అడ్డంకులు కలిగి ఇబ్బందులు ఏర్పడతాయనే ఆందోళన వ్యక్తం అవుతోంది. తాళ్లపాలెం సంత వద్దకు పోలవరం నీరు రావడానికి ఆలస్యం కానుందని సమాచారం. ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్‌ 2న పోలవరం కాలువ ద్వారా సాగు, తాగునీరు, పరిశ్రమలకు నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి హయాంలో జల యజ్ఞంలో చేపట్టిన పోలవరం కాలువ నిర్మాణ పనులు జరగ్గా అక్కడక్కడ మిగిలి ఉన్న పనులను రెండు నెలల క్రితం యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. 7వ ప్యాకేజిలో భాగంగా దార్లపూడి నుంచి తాళ్లపాలెం సంత వరకు పనులు నిర్వహించారు. దీనిలో భాగంగా తాళ్లపాలెం సంత వద్ద విశాఖకు తాగునీరు అందిస్తున్న ఏలేరు కాలువకు గతంలో మిగిలిపోయిన అసంపూర్తి పనులు తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టి పోలవరం కాలువను అనుసంధానించారు. అనుసంధాన ప్రాంతంలో ఏలేరు కాలువ నీరు వెళ్లడానికి ప్రస్తుతం అవరోధం లేకుండా అడ్డుకట్ట వేశారు. పోలవరం కాలువ నుంచి నీరు విడుదల చేయగానే దాన్ని తొలగించి పోలవరం కాలువ నీరు ఇక్కడ ఏలేరు కాలువలో అనుసంధానికి మార్గం సుగమం చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ చేపట్టిన పనులలో భాగంగా అను సంధాన ప్రాంతం వరకు కాలువ తవ్వి సుమారు కిలో మీటరు పొడవున ఎడమ రక్షణ గట్టును కొత్తగా ఏర్పాటు చేసి ఇప్పటికే ఉన్న కుడి గట్టును పట్టిష్టం చేశారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన కాలువ అంతర్‌ భాగంలో సిమెంట్‌ కాంక్రీట్‌తో వేయాల్సిన లైనింగ్‌ పనులు చేపట్టలేదు. దీనివల్ల నీటి ప్రవాహ సమయంలో కాలువలో మట్టి పూడుకుపోవడం, బురద నీరు ప్రవహించడం, ప్రస్తుత ఏలేరు కాలువలోకి ఆ బురద, మట్టి కొట్టుకుపోయి నీటి ప్రవాహానికి అడ్డంకులు కలిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అయితే రెండు నెలల పాటు నీటి ప్రవాహం తర్వాత నిలిపి వేసి లైనింగ్‌ పనులు, శాశ్వత పనులు నిర్వహిస్తారని పోలవరం కాలువ అధికారులు అంటున్నారు. ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా నీరు ప్రవాహానికి అనువుగా తాత్కాలిక ప్రాతిపదికన కాలువను ఏర్పాటు చేశామంటున్నారు. కాలువ నుంచి నీటిని విడుదల చేస్తే మండలంలోని రైతులకు మొదటి దశగా సుమారు 5 వేల ఎకరాల వరకు పంట భూములకు సాగు నీటి సదుపాయం మెరుగు కానుంది. అయితే ప్రభుత్వం సెప్టెంబర్‌ 2వ తేదీన దార్లపూడి వద్ద పోలవరం నీటిని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. అయితే తాళ్లపాలెం వరకు నీరు రావడానికి దాదాపు రెండు రోజులు ఆలస్యం కావచ్చునని అధికారులు అంటున్నారు.

అలాగే తాత్కాలిక ప్రాతిపదికనే నర్సీపట్నం వైపు మార్గంలో పోలవరం కాలువపై కాజ్‌వే రోడ్డు నిర్మించారు. దీని స్థానంలో నూతన ఫ్లై ఓవర్‌ వంతెన నిర్మించాల్సి ఉందని, దీన్ని కూడా తర్వాత చేపడడతామని అధికారులంటున్నారు. తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టిన పనుల వల్ల అవరోధం కలగకుండా శాశ్వత ప్రాతిపదికన పనులను నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు, రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement