దేవరాపల్లి : మండలంలోని రైవాడలో ప్లెక్సీల చించివేత విషయంలో తలెత్తిన వివాదం టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని దేవరాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం కె.కోటపాడు ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 28న గ్రామంలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే వాటిని చించివేశారని ఆరోపణలతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన చల్లా తాతయ్యలు, వైఎస్సార్‌సీపీకి చెందిన చల్లా నాయుడు వర్గీయుల వివాదం రేగింది. నాలుగు రోజుల క్రితం చెలరేగిన వివాదం సద్దుమణగక పోవడంతో ఇరువర్గాలను సోమవారం సాయంత్రం స్థానిక ఏఎస్‌ఐ ప్రసాద్ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి పంపించారు. వీరంతా గ్రామానికి వెళ్లిన తర్వాత ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ కొట్లాటలో తాతయ్యలు అన్నయ్య చల్లా వెంకటరమణ తలపై తీవ్ర గాయం కాగా, కుమారుడు సాయి, భార్య నారాయణమ్మ తదితరులకు గాయాలయ్యాయి. ఇదే ఘర్షణలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఆబోతు రాముకు సైతం తలపై తీవ్ర గాయం కాగా, అతని తల్లి నూకాలు, వదిన కాసులమ్మ, స్వామి తదితరులు గాయపడ్డారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై ఇరువర్గాలు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ వి. సత్యన్నారాయణ తెలిపారు.


