సాక్షి, అనకాపల్లి : పంచదార్ల కొండపై మైనింగ్ ఆగిందా..? లేక రీహాబిలిటేషన్ పేరుతో అక్రమ తవ్వకాలకు కొత్త దారి తెరిచారా? అని వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ నిలదీశారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ఆధ్యాత్మిక, పర్యావరణ, భూగర్భ జలాల ప్రాధాన్యం కలిగిన పంచదార్ల కొండ ప్రజల ఆస్తి. అలాంటి పంచదార్ల కొండ పరిధిలో ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటిస్తూ ఇచ్చిన ప్రభుత్వం జీవోకే విలువ లేకపోతే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. ప్రతిపక్షాల నిరసనలకు తలవంచి చంద్రబాబు ప్రభుత్వమే పంచదార్లను ’నో మైనింగ్ జోన్‌న్’గా ప్రకటిస్తూ జీవో జారీ చేసిందని, అయితే ఉత్తర్వులు వెలువడిన తర్వాత కూడా కొండపై తవ్వకాలు ఎందుకు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రీహాబిలిటేషన్ లెవిలింగ్ పేరిట చేస్తున్న తవ్వకాలను తక్షణమే నిలిపివేసి, టెండర్ల ప్రక్రియ నుంచి గ్రావెల్ తరలింపు వరకు జరిగిన వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపి నిజాలను ప్రజల ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రీహాబిలిటేషన్ పేరుతో మళ్లీ కొండను తవ్వడానికి అనుమతులు ఎలా ఇచ్చారో ప్రభుత్వం జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. చూపిస్తున్న వర్క్ ఆర్డర్ మైనింగ్‌కా లేక రీహాబిలిటేషన్‌న్‌కా అనేది స్పష్టత ఇవ్వాలన్నారు. రీహాబిలిటేషన్ పేరుతో ఇప్పటివరకు ఎంత పరిమాణంలో గ్రావెల్ తీశారు? ఎంత బయటకు తరలించారు? అందులో రీహాబిలిటేషన్‌న్‌కు వాడింది ఎంత? అనే అంశాలపై అధికారులతో కొలతలు వేయించి సమగ్ర విచారణ జరపాలని కోరారు.


