కార్మికుల సొమ్ము నొక్కేస్తున్న యూనియన్ లీడర్ 30 మంది ఫ్యామిలీ పెన్షన్ లబ్ధిదారుల నుంచి భారీగా వసూళ్లు స్టీల్‌ప్లాంట్ కల్యాణ మండపాల కాంట్రాక్టుల్లోనూ అక్రమాలు నెలరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న అక్రమాల నాయకుడు ప్లాంట్ చరిత్రలో తొలిసారిగా నిలిచిపోయిన ఫైనల్ సెటిల్‌మెంట్ సీవీసీ, సీబీఐ కి ఫిర్యాదు చేసిన కార్మిక సంఘాలు విచారణ నుంచి తప్పించాలంటూ టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు
సాక్షి, విశాఖపట్నం: స్టీల్‌ప్లాంట్‌లో ఓ కీలక యూనియన్ నేత సాగించిన అవినీతి బాగోతం తీవ్ర కలకలం రేపుతోంది! కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన నాయకుడే.. ఏకంగా కార్మికుల సొమ్ముల్ని దోచుకుంటూ రూ.కోట్లు గడించారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తడం ప్లాంట్‌లో సంచలనంగా మారింది. అమాయక లబ్ధిదారుల ఫ్యామిలీ పెన్షన్లు మొదలుకుని కల్యాణ మండపాల కాంట్రాక్టులు, ఆన్–డ్యూటీ కేసుల ఆమోదం వరకు ప్రతి దాంట్లోనూ తన మాయాజాలం ప్రదర్శిస్తూ అందినకాడికి దోచుకున్న ఈ ‘అక్రమాల నాయకుడి’పై తోటి కార్మిక సంఘాలు సీవీసీ, సీబీఐలకు ఫిర్యాదు చేయడంతో ఉచ్చు గట్టిగానే బిగుస్తోంది. మరికొద్ది రోజుల్లో పదవీ విరమణకు సిద్ధమవుతున్న తరుణంలో.. ప్లాంట్ చరిత్రలోనే తొలిసారిగా యాజమాన్యం ఆయన ఫైనల్ సెటిల్‌మెంట్‌ని నిలిపివేయడం హాట్‌టాపిక్‌గా మారింది. తన మెడకు చుట్టుకుంటున్న అవినీతి ఫిర్యాదులు, విచారణల నుంచి తనను ఎలాగైనా రక్షించాలంటూ సదరు నాయకుడు ఇప్పుడు అధికార టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం అటు రాజకీయంగానూ, ఇటు కార్మిక వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో గుర్తింపు పొందిన ఓ కార్మిక సంఘం అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు నమోదయ్యాయి. తన పదవిని అడ్డం పెట్టుకుని 2019 నుంచి ఇప్పటివరకు సుమారు రూ.8 కోట్ల నగదు, రెండు కిలోల బంగారాన్ని అక్రమంగా సంపాదించారంటూ..యూనియన్‌కి చెందిన ఓ కీలక నేత కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ, సీబీఐ, చీఫ్ విజిలెన్స్ అధికారులకు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
ఆన్ డ్యూటీ కేసుల ఆమోదంలోనూ
హస్తలాఘవం
నిబంధనలకు విరుద్ధంగా 2020–2025 మధ్య కాలంలో ప్లాంట్ వెలుపల జరిగిన ప్రమాదాలను సైతం విధి నిర్వహణలో జరిగినవిగా (ఐవోడీ) చూపిస్తూ ప్రయోజనాలు పొందేలా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ప్రతి కేసులో సుమారు రూ.80–90 లక్షల ప్రయోజనం చేకూరగా, సంబంధిత కుటుంబాల నుంచి మధ్యవర్తుల ద్వారా రూ.25–30 లక్షలు అక్రమంగా వసూలు చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. ఇక.. యాజమాన్యం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రకటించిన సమయంలో.. దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు ఎక్కడ కోల్పోతామోనన్న భయంతో ఉన్న కొంతమంది ఉద్యోగుల నుంచి ఈ అవినీతి కార్మిక సంఘ నాయకుడు భారీగా వసూళ్లకు పాల్పడ్డారని సమాచారం. పథకం ఆమోదం పొందేలా చేస్తానని వారికి నమ్మకబలికి ఏకంగా రూ.కోటిన్నర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. అయితే.. తన లావాదేవీలన్నీ కుటుంబ సభ్యుల అకౌంట్ల ద్వారా చేస్తుండటంతో.. ఆ ఆధారాల్ని కూడా సీబీఐ, సీవీసీకి అప్పగించినట్లు సమాచారం.
ప్లాంట్ చరిత్రలో తొలిసారిగా..
సదరు కార్మిక సంఘ నాయకుడు త్వరలోనే పదవీ విరమణ చేస్తున్న సమయంలో కొందరు యూనియన్ నాయకులు వరుస ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సీబీఐ, సీవీసీ, కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖకు అక్రమాలపై పక్కా ఆధారాలతో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా అందరి దృష్టి అతని అవినీతిపై పడింది. గతంలో అనేక మంది కార్మిక నాయకులపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈసారి ఆ ఆరోపణల్లో పక్కా ఆధారాలు ఉండటంతో సదరు కార్మిక సంఘ నేతకు సంబంధించిన ఫైనల్ సెటిల్‌మెంట్‌ని యాజమాన్యం నిలిపివేసింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్ చరిత్రలో మొదటిసారిగా ఓ ఉద్యోగైన కార్మిక సంఘ నాయకుడి ఫైనల్ సెటిల్‌మెంట్‌ని నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. ఉన్నత స్థాయి విచారణ ముగిసే వరకు ఈ నిర్ణయం అమలులో ఉండే అవకాశం ఉందని స్టీల్‌ప్లాంట్ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. తనపై వచ్చిన అక్రమాల మరక చెరిపేయాలంటూ స్థానిక టీడీపీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. ఫైనల్ సెటిల్‌మెంట్ సజావుగా జరిగేలా చూడాలంటూ రూ.కోట్లు ఆఫర్ చేస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తుండటం కొసమెరుపు.
కాదేదీ నేత మేతకు అనర్హం
కరోనా మహమ్మారి సమయంలో ప్లాంట్‌లో సుమారు 125 మంది ఉద్యోగులు మరణించగా, వారి కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ కింద రావాల్సిన ప్రయోజనాలను సదరు నాయకుడు సొమ్ము చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన పలుకుబడితోనే పెన్షన్ వస్తుందని నమ్మించి ఒక్కో కుటుంబం నుంచి రూ.5 లక్షల చొప్పున దాదాపు 30 కుటుంబాల నుంచి రూ.కోటిన్నర వరకూ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక.. యూనియన్ పరిధిలో ఉండే కమ్యూనిటీ వెల్ఫేర్ సెంటర్స్‌లో జరిగే కార్యక్రమాలకు సంబంధించి పూల, విద్యుత్ అలంకరణ కాంట్రాక్టర్ల నుంచి అనధికారికంగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏటా జరిగే సుమారు 200 ఫంక్షన్ల ద్వారా రూ.50–60 లక్షల వరకు అక్రమంగా ఆర్జించారని, గత రెండున్నరేళ్లలో సదరు నాయకుడి అక్రమ వసూళ్ల మొత్తం సుమారు రూ.2.5 కోట్లకు చేరుకుందని సమాచారం.


