చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా): మద్యం మత్తులో కారుతో అతివేగంగా వస్తూ బీభత్సం సృష్టించి ఒక కారు, నాలుగు ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. చింతపల్లి సమీపంలోని అంతర్ల ‘టీ టైం’ పాయింట్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు గూడెంకొత్తవీధి మండలంలోని ధారాలమ్మ తల్లిని దర్శించుకుని కారులో తిరిగి వస్తున్నారు. వారు పూటుగా మద్యం సేవించి, కారును విపరీతమైన వేగంతో నడుపుతూ చింతపల్లి సమీపంలోని అంతర్ల శ్మశానవాటిక వద్ద ఉన్న ‘టీ టైం’ బోర్డు పోల్‌ను ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా అక్కడ నిలిపి ఉంచిన వాహనాలపైకి కారు దూసుకెళ్లి బలంగా ఢీకొట్టడంతో నామగిరి వరప్రసాద్, చప్పట్ల వాసు, సాగిన నాగార్జున, వంతల వెంకటరావు, పప్పు సత్తిబాబులకు చెందిన ద్విచక్ర వాహనాలతో పాటు మరో కారు నుజ్జునుజ్జయ్యాయి. అదే సమయంలో పక్కనే ఉన్న వాటర్ సర్వీసింగ్ సెంటర్ నుంచి తన వాహనంతో బయటకు వస్తున్న ఉగ్గిన రమేష్‌ను కూడా కారు ఢీకొట్టడంతో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో పలువురు ఉన్నప్పటికీ ఎవరికీ గాయాలు కానందున స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన సమయంలో కారును పాయకరావుపేట మండలానికి చెందిన పడాల సాయి సమరన్న దొర నడుపుతుండగా, కారులో మామిడి రాజేష్, డీఏ కిరణ్‌తో పాటు మొత్తం నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని, మద్యం మత్తులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.


