రుషికొండలో తప్పిన పెను ముప్పు
ఏడుగురిని రక్షించిన లైఫ్‌గార్డులు
కొమ్మాది(విశాఖ): రుషికొండ సముద్రపు అలల అందాలను చూస్తూ సరదాగా గడపాలని వచ్చిన ఆ పర్యాటకులకు ఊహించని ప్రమాదం ఎదురైంది. ఒక్కసారిగా విరుచుకుపడిన రాకాసి అలలు వారిని సముద్ర గర్భంలోకి లాక్కెళ్లాయి. మృత్యువు అంచున కొట్టుమిట్టాడుతున్న ఆ ఏడుగురిని లైఫ్‌గార్డులు ప్రాణాలకు తెగించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు విజయనగరం జిల్లా సాలూరు ప్రాంతాలకు చెందిన ఏడుగురు పర్యాటకులు ఆదివారం సాయంత్రం రుషికొండ బీచ్‌కు విహారయాత్ర కోసం వచ్చారు. సరదాగా స్నానాలు చేసేందుకు వారంతా సముద్రంలోకి దిగారు.
అలల ఉధృతికి
అయితే ఆ సమయంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజేంద్ర సత్య, మనోజ్, కిశోర్ కుమార్, తరుణ్ వర్మ, సాలూరుకు చెందిన టి.మురళి, జి.శ్రీరామ్‌కుమార్, ఆర్.తేజేశ్వరరావులు అదుపుతప్పి సముద్రంలోకి కొట్టుకుపోయారు. సహాయం కోసం వారు ఆర్తనాదాలు చేయడంతో గమనించిన తీర ప్రాంత లైఫ్‌గార్డులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సముద్రంలోకి దూకారు. తీవ్రంగా శ్రమించి ఏడుగురినీ ప్రాణాలతో ఒడ్డుకు చేర్చారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా ఇళ్లకు పంపించారు. సమయస్ఫూర్తితో స్పందించి ఏడుగురి ప్రాణాలు కాపాడిన లైఫ్‌గార్డుల సాహసాన్ని మైరెన్ సీఐ ఎం.అప్పారావు, ఏఎస్‌ఐ శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించారు.


