రేపటి నుంచి ఆన్‌లైన్ సేవలకు దూరం
ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్
రెండు నెలలుగా జీతాలు అందక ఇబ్బందులు
నక్కపల్లి: ప్రజలతోపాటు, వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వైద్యసిబ్బందికి కూడా కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. ‘ఏరు దాటే వరకూ ఓడ మల్లన్న.. తరువాత బోడి మల్లన్న‘ అన్న చందంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తుండడంతో పాటు, అరకొరగా చెల్లిస్తున్న వేతనాలు కూడా రెండు నెలల నుంచి ఇవ్వకపోవడంతో కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తమ డిమాండ్ల సాధనకు పోరు ఉధృతం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
జిల్లాలో వైద్య విధాన పరిషత్‌తోపాటు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జీజీహెచ్ వంటి ఆస్పత్రుల్లో సుమారు 360 మంది స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్టు రెగ్యులర్ చేయలేదు సరికదా, రెండు నెలల నుంచి జీతాలు కూడా చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయని వాపోతున్నారు.
8వ తేదీ నుంచి విధుల బహిష్కరణ
సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఆందోళన ఉధృతం చేసేందుకు కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులు నిర్ణయించారు. ఆన్‌లైన్ సర్వీసులు (రోజువారీ నివేదికలు, పేషెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వంటి విధులు) బహిష్కరించనున్నారు. సెప్టెంబరు 7న కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేయనున్నారు. 8వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించనున్నట్టు ప్రకటించారు. తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అధికారులకు అందజేసినట్టు కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది సంఘం నాయకులు తెలిపారు.
నిరసన వ్యక్తం చేస్తున్నా...
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాలుగు రోజుల నుంచి కాంట్రాక్ట్ వైద్యసిబ్బంది ఆందోళన చేస్తున్నారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆందోళన ఉధృతం చేయాలని నిర్ణయించారు.
వీరి డిమాండ్లు...
వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న సిబ్బందిని పర్మినెంట్ చేయాలి.
రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు 100శాతం గ్రాస్ వేతనం చెల్లించాలి.
విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ సదుపాయం కల్పించాలి.
అనారోగ్యానికి గురైన ఉద్యోగులకు పూర్తి జీతంతో కూడిన సెలవులు, హెల్త్ కార్డులు మంజూరు చేయాలి.
సంవత్సరాల తరబడి కుటుంబాలకు దూరంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు బదిలీ సదుపాయం కల్పించాలి.
దశలవారీగా ఆందోళన
సమస్యల పరిష్కారం కోసం జూన్ 17న విజయవాడలో ధర్నా చేశాం. 45 రోజుల కార్యాచరణ ప్రకటించాం. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. దీంతో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకు పూర్తిస్థాయిలో నిరసన తెలిపేందుకు సిద్ధపడుతున్నాం. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి దశలవారీగా ఆందోళన ఉధృతం చేస్తాం.
–రాజబాబు, వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల సంఘం జిల్లా జేఏసీ కన్వీనర్
వెట్టిచాకిరీ చేయిస్తున్నారు
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని ఎన్నికల ముందు పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా కాలయాపన చేస్తున్నారు. రెగ్యులర్ అయ్యేలోపు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. మాతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. రెగ్యులర్ చేసే వరకు గ్రాస్ శాలరీ నూరు శాతం చెల్లించాలి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలి.
– జయలక్ష్మి, జిల్లా జేఏసీ అధ్యక్షురాలు


