ప్రభుత్వ భూమిగా మార్చేందుకు యత్నాలు
జిల్లేడుపూడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై కూటమి నేతల కక్ష సాధింపు
గత ఏడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పనుల నిలిపివేత
మళ్లీ ఈ ఏడాది చెరువులో యథావిధిగా పనులు
అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు
నాతవరం : వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు చెందిన జిరాయితీ భూమిలో ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి చేసి ప్రభుత్వ భూమిగా మార్చేందుకు కూటమి నేతలు కుట్ర చేయడంతో బాధితుడు కలెక్టరుకు ఫిర్యాదు చేయడమే కాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో గత ఏడాది పనులు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి నేతల ఒత్తిళ్లతో ఉపాధి హామీ పథకం అఽధికారులు యథావిధిగా చెరువులో పనులు చేస్తున్నారు. మండలంలో జిల్లేడుపూడి పంచాయతీలో సర్వే నెంబరు 240లో 4 ఎకరాల 80సెంట్లు జిరాయితీ భూమి ఇదే గ్రామానికి చెందిన సబ్బి సత్తిబాబు పేరిట రెవెన్యూ రికార్డులో ఉంది. పూర్వం ఈ గ్రామంలో సబ్బి కుటుంబీకులు సంబంధించి సుమారుగా 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండేవి. అప్పట్లో ఉమ్మడిగా సాగునీటి కోసం ఈ భూమిలో కొంత విస్తీర్ణంలో జిరాయితీ చెరువు ఏర్పాటు చేసుకున్నారు. ఆ చెరువు నీరు అధారంగా వ్యవసాయ పంటలు సాగు చేసేవారు. తర్వాత తాండవ రిజర్వాయరు నిర్మాణం, అలాగే వ్యవసాయ బోర్లు ఏర్పాటుతో జిరాయతీ చెరువులో నీరు అవసరం లేకుండా పోయింది. తరువాత కాలంలో వారు భూములు పంచుకోగా, జిరాయితీ చెరువు భూమి సబ్బి సత్తిబాబు తండ్రి జోగులు వాటాకు వచ్చింది. కాగా సత్తిబాబు వైఎస్సార్‌సీపీ కార్యకర్త కావడంతో రాజకీయంగా స్థానిక కూటమి నేతలు ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేశారు. చెరువులో ఉపాధి పనులు చేయించి ప్రభుత్వ చెరువుగా మార్చేందుకు ప్రయత్నాలు సాగించారు. గత ఏడాది ఆ జిరాయితీ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సబ్బి సత్తిబాబు అడ్డుకున్నారు.
అంతేకాకుండా న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో పనులు చేయరాదంటూ సత్తిబాబుకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది సత్తిబాబు కలెక్టరు, ఉపాధి పథకం జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదు చేయడంతో ఆ చెరువులో అనుమతి లేకుండా ఉపాధి నిధులతో పనులు చేయడం జరగదని 4–05–2025 తేదీన అప్పటి డ్వామా ప్రాజెక్టు అధికారి పూర్ణిమాదేవి లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది మళ్లీ చెరువులో ఉపాధి పనులు చేయడంతో సత్తిబాబు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏపీవో దాసరి కొండాజీని వివరణ కోరగా ఈ సమస్య ఇటీవల తన దృష్టికి రావడంతో జిరాయతీ చెరువులో పనులు నిలుపుదల చేశామన్నారు. తనకు తెలియకుండా స్థానిక వీఆర్పీ పని చేయించారేమో తెలుసుకుంటానన్నారు. రైతు అమోదం లేకుండా జిరాయతీ చెరువు భూముల్లో పనులు చేయడం జరగదన్నారు.
నాపై కక్ష సాధింపుగానే..
మా తాత తండ్రులు దగ్గర్నుంచి వారసత్వంగా వచ్చిన జిరాయతీ భూమి పూర్వం మా కుటుంబీకులు వ్యవసాయ సాగు చేసేందుకు సొంతంగా చెరువు చేసుకున్నారు. మా కుటుంబ సభ్యులు భూములు పంపకాలు చేసేటప్పుడు ఈ చెరువు భూమి మా నాన్న వాటాకి వచ్చింది. మా నాన్న కాలం చేయడంతో జిరాయితీ చెరువును ప్రభుత్వ చెరువుగా మార్చేందుకు కూటమి నేతలు కుట్ర చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నాకు అనుకూలంగా కోర్టు స్టే ఇవ్వడంతో గత ఏడాది పనులు అపేశారు. ఇప్పుడు మళ్లీ పనులు చేస్తున్నారు. నా వద్ద కోర్టు స్టే అర్డర్ ఉండగా రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేస్తున్నారు.
–సబ్బి సత్తిబాబు, జిల్లేడుపూడి గ్రామం


