హోం మంత్రి ఇలాకాలో.. బరితెగింపు !
నక్కపల్లి: హైకోర్టు ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ సంక్రాంతి సందర్భంగా కోడిపందాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాదికూడా బహిరంగంగానే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జూద క్రీడలు, కోడిపందాలు నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయం స్థానం ఆదేశించినప్పటికీ.. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా మా కెందుకు బెంగ అంటూ కొంత మంది కూటమి నాయకుల ఆధ్వర్యంలో పందేల కోసం ప్రత్యేక బరులు సిద్ధం చేశారు. హోంమంత్రి ఇలాకా అయిన పాయకరావుపేట నియోజకవర్గంలో కూటమిపెద్దల అండదండలతో గత ఏడాది నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, పాయకరావుపేట మండలాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా కోడిపందేలు జరిగాయి. సుమారు రూ.నాలుగు కోట్ల నుంచి రూ.ఐదు కోట్ల వరకూ చేతులు మారాయని సమాచారం. కోడిపందాలను నిర్వహించరాదని అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అధికార పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు సైతం ఈ పందేల్లో పాల్గొనడం గమనార్హం. గత ఏడాది నక్కపల్లి మండలంలో నెల్లిపూడి తదితర ప్రాంతాల్లో జరిగిన కోడిపందేల్లో అనకాపల్లి ఎంపీ సి.ఎం. రమేష్ కుటుంబంతో సహాపాల్గొన్నారు. ఇదంతా పోలీసులకు తెలిసే జరిగినప్పటికీ తమశాఖకు చెందిన మంత్రి నియోజకవర్గం కావడంతో పందేల వైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా కోడిపందేల నిర్వహణకు మూడు రోజుల ముందే ఏర్పాట్లు చేశారు. తిమ్మాపురం, గుడివాడ, గుర్రాజుపేట, నెల్లిపూడి పరిసరప్రాంతాలు, పాయకరావుపేట, శ్రీరాంపురం తదితర ప్రాంతాల్లో మామిడి తోటల్లో పందేలు నిర్వహిస్తారు. అడ్డురోడ్డు తదితర ప్రాంతాల్లో షామియానాలు వేసి, ప్రత్యేకంగా పందేల కోసం బరులు, గుళ్లాట, ఇతర జూద క్రీడల నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి రూ.5 కోట్లపైనే పందాలు కాస్తారని అంచనా. భోగి నుంచి ముక్కనుమ వరకు నాలుగు రోజుల పాటు కోట్లాది రూపాయల బెట్టింగ్‌లతో ఈ కోడిపందేలను నిర్వహిస్తారు. రాజకీయనాయకులు, పోలీసు అధికారులు, పాత్రికేయుల నుంచి ఇబ్బంది లేకుండా వారికి ఇవ్వాలని లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి నాయకులే ఈ పందేల ఏర్పాటులో కీలక పాత్రపోషిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడిపందేలను పూర్తిస్థాయిలో అరికట్టాలని హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.ఈ ఉత్తర్వులను చంద్రబాబు ప్రభుత్వం,పోలీసు శాఖ ఏమేరకు అమలు చేస్తుందో వేచి చూడాలి.తన నియోజకవర్గంలో కోడిపందేల నిర్వహణకు కూటమి నాయకులు చేస్తున్న ఏర్పాట్లను హోంమంత్రి ఏ మేరకు నిలువరిస్తారో నని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పందేల విషయమై నక్కపల్లి సీఐ జె.మురళీ వద్ద ప్రసావించగా కోళ్ల పందేలకు ఎటువంటి అనుమతులు లేవన్నారు. పందేల నిర్వహణ చట్టవిరుద్ధమని, ఎక్కడైనా నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. ఇప్పటికే ఈ మేరకు హెచ్చరికలు జారీచేసినట్టు చెప్పారు.


