సరుగుడు దుంగలు స్వాధీనం
యలమంచిలి రూరల్: యలమంచిలి అటవీశాఖ పరిధి సీతపాలెం షెల్టర్‌బెల్ట్ ప్రాంతం నుంచి అటవీ సంపద భారీగా తరలిపోతోంది. తుపాన్లు, వాయుగుండాల సమయంలో తీరప్రాంత రక్షణ కోసం అట వీ శాఖ ఇక్కడ పెద్ద ఎత్తున సరుగుడు చెట్లు పెంచుతోంది.కలప స్మగ్లర్లు కన్ను వీటిపై పడింది. పెద్ద ఎత్తున సరుగుడు చెట్లు అక్రమంగా నరికివేసి, రాత్రి సమయాల్లో భారీ వాహనాలతో తరలించుకుపోతున్నారు. 592 సరుగుడు దుంగలను ఒక వ్యాన్‌లో తరలిస్తుండగా యలమంచిలి అటవీ అధికారులు మాటువేసి ఆదివారం రాత్రి పట్టుకున్నారు.వ్యాన్‌తో పాటు దుంగలను యలమంచిలి తరలించి, విచారణ జరుపుతున్నారు.గతంలో కూడా ఇదే తరహాలో పెద్ద ఎత్తున సరుగుడు దుంగలను తరలించుకుపోయినట్టు తెలుస్తోంది.కొద్ది నెలల క్రితం అటవీశాఖ అధికారులు స్వాధీనపరుచుకున్నప్పుడు స్వల్పజరిమానాతో సరిపెట్టడంతో కలప స్మగ్లర్లు మరింతగా రెచ్చిపోతున్నారన్న ఆరోపణలున్నాయి.ఈసారైనా ఉదాసీనంగా వ్యవహరించకుండా కలప అక్రమ రవాణా చేస్తున్న నిందితులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప అటవీ సంపద నరికివేత,అక్రమ రవాణాకు అడ్డుకట్టపడే అవకాశం ఉండదన్న వాదన వినిపిస్తోంది.దీనిపై యలమంచిలి సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సునీల్‌కుమార్ వద్ద ప్రస్తావించగా వాహనంతో కలప స్వాధీనపర్చుకున్న సంగతి వాస్తవమేనన్నారు.కింది స్థాయి అధికారుల నుంచి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు.ఈ వ్యవహారంపై విచారణ జరుగుతోందని,నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని,భారీ జరిమానా విధిస్తామని యలమంచిలి ఫారెస్ట్ సెక్షన్ అధికారి రమణ తెలిపారు.


