20 నుంచి ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ ఛార్జీల అంశానికి సంబంధించి 2026–27 ఆర్థిక సంవత్సరానికి అమలు చేయనున్న టారిఫ్‌లపై ఈనెల 20వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండి ఇమ్మడి పృథ్వీతేజ్ తెలిపారు. ఏపీఈఆర్సీ చైర్మన్ పీవీఆర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని తిరుపతి, విజయవాడ, కర్నూలులో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ సంస్థలు ఏపీఈఆర్సీకి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఎఆర్‌ఆర్)పై జనవరి 20న తిరుపతిలో, 22, 23వ తేదీల్లో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఈఆర్సీ అధికారులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇంధనశాఖ, ఏపీట్రాన్స్‌కో, ఏపీజెన్‌కో, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ అధికారులు పాల్గొంటారని తెలిపారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఏపీఈఆర్సీ ప్రతి రోజు మూడు విద్యుత్ పంపిణీ సంస్థల టారిఫ్ ఫైలింగ్‌కు సంబంధించిన అభిప్రాయాలను స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అభిప్రాయాలు చెప్పదలుచుకున్నవారు సమీప విద్యుత్ ఆపరేషన్ సర్కిల్ కార్యాలయం(ఎస్‌ఈ ఆఫీస్) లేదా డివిజన్ కార్యాలయం(ఈఈ ఆఫీస్) నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.


